ప్రభుత్వ భూములు గోవింద!!
ABN , First Publish Date - 2021-11-26T06:14:42+05:30 IST
ఆయన కన్ను పడిందంటే...ఆ భూమి ‘గోవిందే’!!. వార్డు స్థాయి నాయకుడైన ఆయన...

రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణ
షెడ్లు వేసి బినామీ పేర్లతో అద్దెకు ఇస్తున్న వార్డు స్థాయి నాయకుడు
గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు
తాజాగా విజయసాయిరెడ్డి దృష్టికి...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆయన కన్ను పడిందంటే...ఆ భూమి ‘గోవిందే’!!. వార్డు స్థాయి నాయకుడైన ఆయన...ఏ పార్టీ అధికారంలో ఉంటే...అరక్షణంలో అటు వైపు తిరిగిపోతారు. తన వార్డు పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే ఆయన ప్రధాన వ్యాపకం. ముందు ఆక్రమించడం, ఆ తరువాత బినామీలతో షెడ్లు వేయించడం, ఆపై వాటిని వేల రూపాయలకు అద్దెకు ఇవ్వడం...ఇదీ ఆయన వ్యవహార శైలి. ఈ క్రమంలో ఎవరైనా అడ్డం పడితే అధికార పార్టీ ప్రతినిధినంటూ దబాయిస్తారు.
గాజువాక నియోజకవర్గంలో ప్రభుత్వ, ఏపీఐఐసీ భూములు అధికంగా వున్న ప్రాంతం అదే కావడం ఆ నాయకుడికి కలిసి వచ్చింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి పదవులను అనుభవించిన ఆయన తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో అదే పార్టీ తరపున విజయం సాధించారు. కానీ ఎన్నికలైన వెంటనే అధికార పార్టీ పంచన చేరిపోయారు. ఇప్పుడు ఆ ధైర్యంతోనే చెరువులు, వాగులతో పాటు ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై స్థానిక ప్రజలు గతంలో ఒకసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా సదరు నాయకుడు ఆక్రమించుకున్న భూముల చిట్టాను అందజేశారు. తుంగ్లాం రెవెన్యూ పరిధి చుక్కవానిపాలెం కాలనీ సమీపంలోని 50, 52, 53, 82/18 తదితర సర్వే నంబర్లలో సుమారు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, షెడ్లు వేసి షాపులుగా మార్చి సదరు నాయకుడు అద్దెకు ఇచ్చుకున్నారు. ఇవన్నీ బినామీ పేర్లతో వుండడం గమనార్హం. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని, దీనిలో ప్రవేశించేవారు శిక్షార్హులని రెవెన్యూ అధికారులు గతంలో బోర్డు పెట్టారు. దాన్ని తొలగించి మరీ ఆక్రమించుకున్నారు. తాజాగా తుంగ్లాం గ్రామ సమీపంలో సర్వే నంబర్ 95లో ప్రభుత్వ భూమి (బంద) సుమారు అర ఎకరా స్థలాన్ని ఆక్రమించి అందులో 12 షెడ్లు వేశారు. వాటిని కూడా అద్దెకు ఇచ్చేశారు.
ఇదీ చిట్టా
సదరు నేత ఆక్రమణలకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి వార్డు ప్రజలు పంపిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. తుంగ్లాం సర్వే నంబరు 51/1బిలో 1.5 ఎకరాలు, 52/1ఎలో 1.8 ఎకరాలు, 53/1ఎలో 0.04 సెంట్లు, 84లో 2.09 ఎకరాలు, 81/6లో 0.50 సెంట్లు, 14/2లో 1.8 ఎకరాలు, 33/2లో 1.34 ఎకరాలు, 34/2లో 0.24 సెంట్లు, 30/12లో 1.1 ఎకరాలు, 30/13లో 0.27 సెంట్లు, 30/15లో 0.68 సెంట్లు, 33/4లో 0.13 సెంట్లు, 82లో 80 సెంట్లు, ఫకీరుతక్యాలోని సర్వే నంబరు 87లో 3 ఎకరాలు, 53లో 0.6 సెంట్లు, గుర్రంపాలెం 177, 178, సర్వే నంబరులో వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఆక్రమించుకున్నట్టు ఆరోపించారు. అలాగే జగ్గరాజుపేటలో తాను నిర్మించిన ఫ్లాట్లకు వెళ్లేందుకు సర్వే నంబర్లు 116, 117, 118లలో రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంటి నిర్మాణం కోసం చెరువు స్థలాన్ని ఆక్రమించుకున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా సహించేది లేదంటూ పదేపదే చెప్పే విజయసాయిరెడ్డి...ఆ ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తారా లేక తమ మద్దతుదారుడిగా వున్నారని వదిలేస్తారా?...చూడాలి.