‘డయల్‌ యువర్‌ ఈవో’కు మంచి స్పందన

ABN , First Publish Date - 2021-12-28T06:07:02+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పరిధిలో ప్రపథమంగా కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది.

‘డయల్‌ యువర్‌ ఈవో’కు మంచి స్పందన
ఫోన్‌లో మాట్లాడుతున్న ఈవో సూర్యకళ

సింహాచలం, డిసెంబరు 27: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పరిధిలో ప్రపథమంగా కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రతీనెల ఆఖరి సోమవారం ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించడంతో తొలిరోజు 12 మంది భక్తులు ఫోన్‌ చేసి పలు సమస్యలను సూర్యకళకు వివరించడంతో పాటు ఆలయ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిలో ప్రధానంగా మెట్ల మార్గాన్ని శుభ్రపరచాలని పద్మ అనే భక్తురాలు సూచించగా, రామకృష్ణ అనే భక్తుడు మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్స్‌కు స్వామివారి దర్శనానికి, ప్రసాదాల కొనుగోలుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. నారాయణరావు అనే భక్తుడు మాట్లాడుతూ టోల్‌గేటు వద్ద ఘాట్‌రోడ్డుకు సంబంధించిన టికెట్లను మాత్రమే విక్రయించాలని, ఇక్కడ దర్శన టికెట్లు అమ్ముతున్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అలాగే ధర్మారావు అనే మరొక భక్తుడు మాట్లాడుతూ కోటప్పకొండ మాదిరిగా ఘాట్‌రోడ్డులో ఇరువైపులా అందం, ఆహ్లాదం కలిగేలా పువ్వుల మొక్కలను పెంచాలనగా, సీహెచ్‌ రామారావు అనే వ్యక్తి మాట్లాడుతూ వరాహ పుష్కరిణి వద్ద దుస్తులు మార్చుకునే గదులు, కూర్చోవడానికి వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సమస్యలు, సూచనలకు ఈవో సానుకూలంగా స్పందిస్తూ అవకాశాన్ని బట్టి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని బదులిచ్చారు. 

Updated Date - 2021-12-28T06:07:02+05:30 IST