కేజీహెచ్‌లో గోల్‌మాల్
ABN , First Publish Date - 2021-05-14T05:08:41+05:30 IST
కేజీహెచ్‌లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న సీఎస్‌ఆర్ బ్లాక్‌లో కొత్త సమస్య తలెత్తింది.

కరోనా బ్లాకులో మృతుల వస్తువులు గల్లంతు
ఆభరణాలు, సెల్‌ఫోన్లు కాజేస్తున్న కొంతమంది సిబ్బంది
మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికీ ఇబ్బందులు
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): కేజీహెచ్‌లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న సీఎస్‌ఆర్ బ్లాక్‌లో కొత్త సమస్య తలెత్తింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించిన వారి ఆభరణాలను, సెల్‌ఫోన్లను అక్కడి సిబ్బంది తస్కరిస్తున్నారు. వాటిని జాగ్రత్తగా బంధువులకు అప్పగించాల్సి ఉండగా, ఆ విధంగా చేయడం లేదు. ఈ రకమైన సేవల కోసం ‘హెల్ప్ డెస్క్’ ఒకటి ఏర్పాటుచేశారు. అది కేవలం ఉదయం 8 నుంచి 9 గంటల వరకే పనిచేస్తుంది. ఆ తరువాత మూసేస్తున్నారు. రోజూ అక్కడ పది మందికిపైగానే చనిపోతున్నారు. అందులో కనీసం సగం మంది తాలూకా విలువైన వస్తువులు కొద్దిరోజులుగా అదృశ్యమవుతున్నాయి. దీనిపై హెల్ప్ డెస్క్ సిబ్బందిని ప్రశ్నిస్తే..రోగి పేరు చెప్పమంటున్నారు. ఆ పేరు చెబితే..అలాంటి వారు ఎవరూ ఇక్కడ చేరలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కేకలు వేస్తున్నారు. దీంతో బంధువులు ఏమి చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు. ఇక అక్కడ చనిపోయినట్టుగా పత్రాలు (డెత్ సర్టిఫికెట్) కావాలని మరికొందరు అడుగుతున్నారు. అవి వుంటే తప్ప తమకు భర్త/భార్య/తమ్ముడు/తండ్రి పనిచేసే కంపెనీ నుంచి పరిహారం రాదని, వాటిని ఇవ్వాలని కోరుతున్నారు. దానికి కూడా అక్కడ సరైన స్పందన కనిపించడం లేదు. ఏమైనా కావాలంటే...పైకి వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. వారు చెప్పిన దగ్గరకు వెళ్లడానికి యత్నిస్తే...అది కరోనా వార్డు అని, ఎవరూ వెళ్లకూడదంటూ పోలీసులు బయటకు పంపేస్తున్నారు. ఇలాగైతే తమ కష్టాలు ఎలా తీరతాయని వారు వాపోతున్నారు. మురళీనగర్‌కు చెందిన భార్యాభర్తలు పది రోజుల క్రితం ఆ వార్డులో చికిత్సకు చేరారు. భార్య రెండు రోజుల క్రితం చనిపోయారు. ఆమె కుమారుడు తన తల్లి చెవికి బంగారు పోగులు ఉన్నాయని, అలాగే సెల్‌ఫోన్ ఉందని, వాటిని అప్పగించాలని హెల్ప్ డెస్క్‌లో కోరితే..అలాంటి వ్యక్తులు ఎవరూ చనిపోలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అధికారులు ఇలాంటి సమస్యలపై తక్షణమే దృష్టిసారించి తగిన పరిష్కారం చూపించాల్సి ఉంది. ఇటీవల వార్డుల్లో పనిచేయడానికి కేజీహెచ్ అధికారులు అక్కడి పరిసరాల్లో కొంతమందిని చేర్చుకున్నారు. అందులో కొందరు శవాలపై విలువైన వస్తువులను తస్కరిస్తున్నారని, అడిగితే...మీరు చూశారా? అంటూ దబాయిస్తున్నారని తెలిసింది. దీనిపై కేజీహెచ్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.