ఘనంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ వ్యవస్థాపక దినోత్సవం

ABN , First Publish Date - 2021-08-21T05:27:48+05:30 IST

దేశ నావికాదళానికి అవసరమైన వ్యవస్థల అభివృద్ధిలో ఎన్‌ఎస్‌టీఎల్‌ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అన్నారు.

ఘనంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ వ్యవస్థాపక దినోత్సవం
శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేస్తున్న డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి

గోపాలపట్నం, ఆగస్టు 20: దేశ నావికాదళానికి అవసరమైన వ్యవస్థల అభివృద్ధిలో ఎన్‌ఎస్‌టీఎల్‌ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అన్నారు. నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌ )52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మానసి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై  మాట్లాడుతూ ఎన్‌ఎస్‌టీఎల్‌ కృషి ఫలితంగా జలాంతర ఆయుధాల అభివృద్ధి రంగంలో గుర్తింపు పొందిన దేశాల సరసన భారత్‌ చేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఫాలోవర్‌ దశ నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ టెక్నాలజీ లీడర్‌గా ఎదగడం అభినందనీయమని కొనియాడారు. నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సమీర్‌ వి కామత్‌, ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్త, డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావులు సాధించిన పురోగతిని వివరించారు. ప్రస్తుత అత్యాధునిక ప్రీమియర్‌ నావికా ప్రయోగశాల అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వెల్లడించారు. గత సంవత్సర విజయాలు, భవిష్యత్‌ లక్ష్యాలను వివరించారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ సివిల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ కొవిడ్‌-19 సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ రూపొందించిన హైపవర్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని పుణేకు చెందిన భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)కు డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ, శాస్త్రవేత్తలు పీవీఎస్‌ గణేశ్‌కుమార్‌, బీవీఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, డాక్టర్‌ ఎ.శ్రీనివాసకుమార్‌, ఎన్‌ఎస్‌టీఎల్‌ సివిల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అండ్‌ వర్కర్స్‌ కమిటీ కార్యదర్శి హేమంత్‌ బైస్‌, ఎన్‌ఎస్‌టీఎల్‌ సివిల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అండ్‌ స్టాఫ్‌ ఉపాధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T05:27:48+05:30 IST