గ్రేట్ ఎచీవర్స్
ABN , First Publish Date - 2021-03-21T06:25:30+05:30 IST
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.

గేట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
పెందుర్తి వాసికి 15, నర్సీపట్నం విద్యార్థికి 191 ర్యాంకు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. జీవీఎంసీ 95వ వార్డుకు చెందిన కాళ్ల ప్రవీణ్ ఎలక్ర్టికల్ విభాగంలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించగా, నర్సీపట్నానికి చెందిన పెదిరెడ్ల సాయివంశీ మెకానికల్ విభాగంలో 191వ ర్యాంకు సాధించాడు.
ఎలక్ర్టికల్ బ్రాంచీలో పెందుర్తి విద్యార్థికి 15వ ర్యాంకు
పెందుర్తి/పెందుర్తి రూరల్, మార్చి 20: గేట్ ఫలితాల్లో 95వ వార్డు పరిధి లక్ష్మీపురం గవరపాలెం కాలనీకి చెందిన కాళ్ల ప్రవీణ్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసిన ప్రవీణ్‌కు వెయ్యికి 921 మార్కులు రావడంతో 15వ ర్యాంకు లభించింది. ప్రవీణ్ 2019లో భువనేశ్వర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఆయన తండ్రి సూర్యనారాయణ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి ధనలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపిన ప్రవీణ్ టెన్త్‌లో 9.7 జీపీఏ, ఇంటర్ (సీబీఎస్‌ఈ)లో 93.48 శాతం మార్కులు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1200 ర్యాంకు పొందాడు. ఐఈఎస్ (ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్) సాధించడమే తన లక్ష్యమని ప్రవీణ్ తెలిపాడు.
మెకానికల్‌లో నర్సీపట్నం విద్యార్థికి 191వ ర్యాంకు
నర్సీపట్నం: ‘గేట్’లో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన పెదిరెడ్ల సాయివంశీ జాతీయ స్థాయిలో 191వ ర్యాంకు సాధించాడు. సాయివంశీ నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ కోర్సులో డిప్లొమా చేసి ఇ-సెట్‌లో మూడో ర్యాంకు సాధించి ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు దక్కించుకున్నాడు. 2017-20లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, అదే విభాగంలో గేట్ రాసి 191వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి మహాలక్ష్మి నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి శ్రీదేవి గృహిణి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) బెంగళూరులో ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నదే తన లక్ష్యమని సాయివంశీ తెలిపాడు.