మూడు రకాలుగా చెత్త సేకరణ

ABN , First Publish Date - 2021-07-23T05:51:23+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మునిసిపల్‌ పారి శుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేపడు తున్న చెత్త సేకరణలో కొత్త విధానాన్ని అవలంబించనున్నారు.

మూడు రకాలుగా చెత్త సేకరణ
పట్టణంలో త్వరలో అందించనున్న చెత్త డబ్బాల నమూనా


  త్వరలో మునిసిపాలిటీలో మారుతున్న విధానం 

  తడి, పొడితో పాటు ఇకపై ప్రమాదకర చెత్తనూ వేర్వేరుగా అందించాలి

  ప్రతి ఇంటికీ మూడు ప్లాస్టిక్‌ డబ్బాలు పంపిణీకి సన్నాహాలు

  ‘సెల్లోవిమ్‌ ప్లాస్ట్‌’కు టెండరు  ఖరారు..15 రోజుల్లో సరఫరా

నర్సీపట్నం, జూలై 22 : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మునిసిపల్‌ పారి శుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేపడు తున్న చెత్త సేకరణలో కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. ఇప్పటి వరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిం చాలని నిబంధన ఉండగా, వచ్చే నెల నుంచి మూడో రకం చెత్తపై దృష్టి పెడుతున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా ఈ ప్రక్రియ సఫలం కాలేదు. కాయగూరలు, ఆకు కూరల వ్యర్థాలు, ఎంగిలి మెతుకులు, కుళ్లిన పండ్లు తడి చెత్తగాను, పేపర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెక్కలు పొడి చెత్తగాను వేరు చేసి ఉంచాలి. వీటిని ఇంటింటికీ వచ్చి విజల్‌ వేసినప్పుడు పారిశుధ్య కార్మికులకు అందించాలి. కానీ అవగాహన లేమితో కొందరు, నిర్లక్ష్యం వల్ల మరికొందరు తడి, పొడి చెత్తలను కలిపి ఇస్తున్నారు. అదే విధంగా ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కంపోస్ట్‌ యార్డు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. దీంతో పారిశుధ్య కార్మికులు తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి వస్తుంది. ఆగస్టు నుంచి ప్రమాదకర చెత్తపై దృష్టి పెడుతున్నారు. సూదులు, బ్లేడ్లు, గాజు ఉత్పత్తులు, కాటన్‌ బ్యాండేజీలు, శానిటరీ వ్యర్థాలను మూరో రకం చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలి.    

ఇదిలావుంటే, తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా అందించేందుకు మునిసిపాలిటీ మూడు రకాల ప్లాస్టిక్‌ డబ్బాలను ఇంటింటికీ అందజేస్తుంది. పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణకు వచ్చినప్పుడు పచ్చ డబ్బాలో తడి చెత్త, నీలం రంగు డబ్బాలో పొడి చెత్త, ఎరుపు రంగు డబ్బాలో ప్రమాదక చెత్తను వేర్వేరుగా అందించాల్సి ఉంటుంది. మునిసిపాలిటీలోని 28 వార్డుల్లో 19,670 ఇళ్లు ఉండగా, ఒక్కో ఇంటికి మూడు డబ్బాలు చొప్పున 60 వేలు ప్లాస్టిక్‌ డబ్బాలు కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. దీంతో సెల్లోవిమ్‌ ప్లాస్ట్‌ కంపెనీ రూ.31.58 లక్షలకు డబ్బాలు సరఫరాకు ముందుకు రావడంతో టెండరు ఖరారు చేశారు. 15 రోజుల్లో డబ్బాలు సరఫరా చేస్తామని సదరు కంపెనీ చెప్పినట్టు సమాచారం. ఆగస్టు రెండో వారం నుంచి వీటిని ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మూడు రకాల చెత్తను మూడు డబ్బాల్లో వేర్వేరుగా అందించాలని  కనకారావు కోరుతున్నారు.

Updated Date - 2021-07-23T05:51:23+05:30 IST