గంజాయి కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2021-10-31T06:06:41+05:30 IST

విశాఖ ఏజెన్సీలో గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు చెప్పారు.

గంజాయి కట్టడికి చర్యలు

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

సాగు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు


గూడెంకొత్తవీధి, అక్టోబరు 30: విశాఖ ఏజెన్సీలో గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు చెప్పారు. శనివారం గూడెంకొత్తవీధి స్టేషన్‌ను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి ఆయన సందర్శించారు. తొలుత స్టేషన్‌ భద్రత, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై ఆరా తీశారు. అలాగే గంజాయి సాగు, రవాణా మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ రంగారావు మాట్లాడుతూ మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించాలన్నారు. వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. గంజాయి సాగు, రవాణాను కట్టడి చేయాలన్నారు. గంజాయి వల్ల కలిగే నష్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీలు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారని, ఇదే పరిస్థితి ఏజెన్సీవ్యాప్తంగా తీసుకురావాలన్నారు. స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గంజాయి సాగును ప్రోత్సహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్నివర్గాలతో కలిసి పనిచేయాలన్నారు. ఆయన వెంట చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డుడి, సీఆర్‌పీఎఫ్‌ ఏసీ బీరేందర్‌కుమార్‌, సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ సమీర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-10-31T06:06:41+05:30 IST