విదేశీ ఎగుమతులకు అనువుగా పూల సాగు

ABN , First Publish Date - 2021-11-23T06:06:46+05:30 IST

గిరిజన మండలాల్లో విదేశీ ఎగుమతులకు అనువైన పూల సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు(డీఆర్‌) డాక్టర్‌ ఎన్‌. త్రిమూర్తులు అన్నారు.

విదేశీ ఎగుమతులకు అనువుగా పూల సాగు
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు


మేలిజాతి వంగడాలపై పరిశోధనలు

ఎన్‌జీరంగా యూనివర్సిటీ డీఆర్‌ త్రిమూర్తులు


చింతపల్లి, నవంబరు 22: గిరిజన మండలాల్లో విదేశీ ఎగుమతులకు అనువైన పూల సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు(డీఆర్‌) డాక్టర్‌ ఎన్‌. త్రిమూర్తులు అన్నారు. సోమవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళా స్టాళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ పి.రాంబాబు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో డీఆర్‌ మాట్లాడారు. గిరిజన రైతులకు అధిక ఆదాయం సమకూర్చేందుకు పూల సాగును పరిచయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పూలకు మార్కెటింగ్‌ సదుపాయం విశ్వవిద్యాలయం కల్పిస్తుందన్నారు. బెంగళూరు కంటే ఇక్కడే గ్లాడియోలస్‌ పంట నాణ్యమైన దిగుబడి వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. రైతులకు ఆర్గానిక్‌ ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేస్తామన్నారు. రాజ్‌మా పంటలో మేలిజాతి విత్తనాల అభివృద్ధికి కాన్పూరు పరిశోధన స్థానం సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ గుత్తా రామారావు ఏడాదిపాటు  నిర్వహించిన పరిశోధనల ఫలితాలను వివరించారు. అనంతరం రస్తకుంటుబాయి, స్థానిక పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన కరపత్రాలు, పుస్తకాలను విస్తరణ సంచాలకులు, పరిశోధన సంచాలకులు ఆవిష్కరించారు. కిసాన్‌ మేళాలో శాస్త్రవేత్తలు, ఎన్‌జీవోలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యకళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్టాళ్లను పరిశీలించిన డీఆర్‌ డాక్టర్‌ త్రిమూర్తులు, ఈడీ డాక్టర్‌ రాంబాబు, ఏడీఆర్‌ గుత్తా రామారావులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన అనకాపల్లి అగ్రిటాప్‌ మిషన్‌, లయ ఆర్గనైజేషన్‌ పాడేరు, ఏపీసీఎన్‌ఎఫ్‌ పాడేరు స్టాళ్లకు బహుమతులను అందజేశారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలకు చెందిన పది మంది ఉత్తమ రైతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ సేవలందించిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ జోగారావు, డాక్టర్‌ సీతారామ్‌, ఆర్‌ఏ డాక్టర్‌ సౌజన్యలకు పురస్కారాలను అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బిందు సేద్యం డీపీఎం మోహన్‌రావు, అనకాపల్లి ఏడీఆర్‌ ఎం.భరతలక్ష్మి, రాష్ట్ర ఆర్గానిక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సీతారామలక్ష్మి, పాలకమండలి సభ్యులు దేవుళ్లు, డాక్టర్‌ విజయ భాస్కర్‌, ఏడీ ఝాన్సీలక్ష్మి, పశుసంవర్థక ఏడీ డాక్టర్‌ చంద్రశేఖరరావు, పాడేరు ఏడీఏ రత్నకుమారి, పీహెచ్‌వో బిందు, జేఎల్‌వో శ్రీరమణ, సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ దేశగిరి శేఖర్‌, మోహన్‌రావు, డాక్టర్‌ సీతారామ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-23T06:06:46+05:30 IST