విమానయానం మందగమనం

ABN , First Publish Date - 2021-02-06T06:43:02+05:30 IST

కరోనా కారణంగా రాష్ట్రంలో విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి.

విమానయానం మందగమనం

భారీగా తగ్గిన ప్రయాణికులు

విశాఖ నుంచి 2019లో 27,81,494 మంది ప్రయాణం

2020లో 12,65,434 

ప్రస్తుతం సగటున నెలకు లక్ష మందే ప్రయాణం

విమానాలు, కార్గో కూడా తగ్గాయి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా కారణంగా రాష్ట్రంలో విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి. కరోనాకు ముందు 2019లో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నెలకు సగటున రెండు లక్షల మంది ప్రయాణించగా, 2020లో ఆ సంఖ్య లక్షకు పరిమితమైంది. 2019లో విశాఖ నుంచి 27,81,494 మంది ప్రయాణించగా 2020లో 12,65,434 మంది ప్రయాణించారు. అంటే 55 శాతం మంది తగ్గిపోయారు. విజయవాడను తీసుకుంటే...అక్కడ 2019లో 11.84 లక్షల మంది ప్రయాణించగా, 2020లో ఆ సంఖ్య 5.27 లక్షల దగ్గరే ఆగిపోయింది. 56 శాతం పడిపోయింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 2019లో 3.87 లక్షల మంది ప్రయాణించగా, 2020లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. అంటే 42 శాతం తగ్గుదల కనిపించింది. తిరుపతి విమానాశ్రయం నుంచి 2019లో 8.52 లక్షల మంది ప్రయాణించగా, 2020లో 3.57 లక్షల మందే ప్రయాణించారు.


పది వేల విమానాలు తగ్గిపోయాయి


విశాఖ విమానాశ్రయం నుంచి 2019లో 21,455 విమానాలు రాకపోకలు సాగించగా 2020లో 11,467 మాత్రమే నడిచాయి. అంటే దాదాపుగా 10 వేల విమానాలు (47 శాతం) తగ్గిపోయాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి 2019లో 16,452 విమానాలు నడవగా, 2020లో 7,781 విమానాలే వచ్చి వెళ్లాయి. రాజమండ్రిలో 2019లో 9,379 విమానాలు నడవగా, 2020లో 6,358కే పరిమితమయ్యాయి. తిరుపతిలో ముందుటేడాది 10,385 విమానాలు రాకపోకలు చేయగా, గత ఏడాది 4,391 మాత్రమే వచ్చి వెళ్లాయి. 


కార్గో 40 శాతం తగ్గింది


విశాఖ విమానాశ్రయం నుంచి 2019లో 5,926 టన్నుల సరకు రవాణా చేయగా, 2020లో 3,635 టన్నులు మాత్రమే రవాణా జరిగింది.


ఇకపై పుంజుకుంటుంది: అపాటా


కరోనా వల్ల ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో 2020లో విమాన ప్రయాణాలు బాగా తగ్గాయని, ఇప్పుడు విశాఖ నుంచి రోజుకు 20 విమానాలు వచ్చి వెళుతున్నాయని ఏపీ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ (అపాటా) ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, డీఎస్‌వర్మ, కుమార్‌రాజాలు తెలిపారు. 2021లో మళ్లీ పూర్వ వైభవం వస్తుందని, ప్రయాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉడాన్‌ పథకం వల్ల చిన్న నగరాలకు కూడా విమానాలు నడుస్తాయన్నారు.


Updated Date - 2021-02-06T06:43:02+05:30 IST