బడిలో ప్రథమ చికిత్స కరువు

ABN , First Publish Date - 2021-02-06T06:35:52+05:30 IST

బడిలో ప్రథమ చికిత్సకు మెడికల్‌ కిట్లు కరువు

బడిలో ప్రథమ చికిత్స కరువు
ఆటలాడుతున్న విద్యార్థులు, పక్కన మెడికల్‌ కిట్‌ (ఫైల్‌ ఫొటోలు)

పాఠశాలల్లో కనిపించని ప్రథమ చికిత్స పెట్టెలు

మెడికల్‌ కిట్లు ఇవ్వని ప్రభుత్వం

చిన్నపాటి గాయాలకు సైతం ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు


పరవాడ, ఫిబ్రవరి 5: విద్యార్థులంటే ఒక చోట కుదురుగా ఉండరు. ఆటలు, పాటలు, ఉరుకులు, పరుగులు వారి స్వభావం. పది మంది విద్యార్థులు ఒక చోట చేరితే ఇక అల్లరే అల్లరి. ఇలాంటి సమయాల్లో చిన్నపాటి గాయాలు తగలడం సహజం. ఇక ఆటలు ఆడే సమయంలోనూ స్వల్ప గాయాలు అవుతూనే ఉంటాయి. అప్పుడు సత్వరమే చికిత్స అందించేందుకు పాఠశాలల్లో ప్రథమ చికిత్స పెట్టెల అవసరం ఉంటుంది. 2011 సంవత్సరంలో మెడికల్‌ కిట్లను ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం వాటికి కాలం చెల్లిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా కొనుగోలుకు నిధులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో  పాటు జీవీఎంసీ 55, 56, 69, 70, 71 వార్డులు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 152, ప్రాథమికోన్నత పాఠశాలలు 28, ఉన్నత పాఠశాలలు 36 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 38 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఏడాదికి రూ.5వేలు నిర్వహణ ఖర్చుల కింద, ఇతర ఖర్చుల నిమిత్తం మరో రూ.7 వేల వరకు నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను విద్యుత్‌ బిల్లులు, జాతీయ పండుగల నిర్వహణకు, చాక్‌పీస్‌లు తదితర వాటి వినియోగానికి ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రథమ చికిత్స పెట్టెల కొనుగోళ్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. 


క్రీడాకారులైతే మరింత అవస్థలు

నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం వేళ కొద్ది సేపు ఆటలాడుకునేందుకు సమయం కేటాయిస్తారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు పాఠశాలల మైదానాల్లోనే సాధన చేస్తుంటారు. ఇలా శిక్షణ పొందే సమయంలో కానీ, ఆడుకునే సమయంలో కానీ చిన్న చిన్న గాయాలు తగిలితే ప్రథమ చికిత్స చేయడానికి కిట్లు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో విద్యార్థులకు గాయాలైతే దగ్గరలోని వైద్యుల వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు తెలిపారు. 


మెడికల్‌ కిట్లు చాలా అవసరం

గతంలో ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ప్రతి సంవత్సరం పాఠశాలలకు మెడికల్‌ కిట్లు అందజేసింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి కిట్లు అందజేయడం లేదు. ఫలితంగా విద్యార్థులకు చిన్న గాయమైనా వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. 

- ఎం.సునీత, ఎంఈవో పరవాడ


Updated Date - 2021-02-06T06:35:52+05:30 IST