కదంతొక్కిన మన్యం ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-11-26T06:17:15+05:30 IST

లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడిచేసిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కదంతొక్కిన మన్యం ఉపాధ్యాయులు
చింతపల్లిలో ర్యాలీ చేస్తున్న ఉపాధ్యాయులు


దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్‌

చింతపల్లి, నవంబరు 25: లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడిచేసిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మండలానికి చెందిన ఉపాధ్యాయులు మాస్‌లీవ్‌ పెట్టి ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. గిరిజన భవన్‌ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ గోపాలకృష్ణకి వినతిపత్రం అందజేశారు. అలాగే ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్నభోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో వివిధ సంఘాల నేతలు దేపూరి శశికుమార్‌, ఎంవీ రమణ, కేవీ రమణ, లోచెల రామకృష్ణ, శెట్టి సూరిబాబు, యూవీగిరి, బౌడు గంగరాజు, లోచెల చిట్టినాయుడు, ఎస్‌ఎస్‌ నాయుడు, చింతర్ల సాగర్‌, ఎం.రాజబాబు, కాగి వెంకయమ్మ పాల్గొన్నారు. 


దాడిచేసిన వారిపై చర్యలు : బుల్లిబాబు


 లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన హెచ్‌ఎంను పరామర్శించారు.   ఈసందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణకు బయట వ్యక్తులు వచ్చి హెచ్‌ఎంపై దాడి చేయడం చాలా విచారకరమన్నారు. హెచ్‌ఎంను పరామర్శించిన వారిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మత్స్యరాస విశ్వేశ్వరరావు, స్థానిక ఎంపీపీ వంతల బాబూరావు పాల్గొన్నారు. అలాగే హెచ్‌ఎం రాజంనాయుడుని కొయ్యూరు, చింతపల్లి పీజీ ప్రధానోపాధ్యాయులు ప్రభుదాస్‌, రాజేశ్వరి, వీరభద్రరావు తదితరులు పరామర్శించారు. అలాగే చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య హెచ్‌ఎంని పరామర్శించారు. హెచ్‌ఎంపై దాడి చేసిన వారిని శిక్షించాలని గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి, గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు డిమాండ్‌ చేశారు.


లోతుగెడ్డ ఘటనపై విచారణ : ఏఎస్పీ 


లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఏఎస్పీ తుషార్‌ డుడి అన్నారు. గురువారం లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏఎస్పీ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంను విచారించారు. ఈసందర్భంగా ఏఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. ల్యాప్‌టాప్‌ను అప్పగించడానికి వచ్చిన అన్నవరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, హెచ్‌ఎం మధ్య ప్రారంభమైన వాగ్వాదం భౌతిక దాడికి దారి తీసిందన్నారు. ఈఘటనపై ఇరుపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నామన్నారు. సోషల్‌మీడియాలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య జరిగిన సంఘటన మాదిరిగా అసత్య ప్రచారం జరుగుతుందని, ఇటువంటి ప్రచారం చేయరాదన్నారు.  కార్యక్రమంలో సీఐ శ్రీను పాల్గొన్నారు.

 

నేడు మన్యం బంద్‌ : జేఏసీ 


పాడేరు: చింతపల్లి మండలం లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడికి నిరసనగా శుక్రవారం మన్యం బంద్‌కు పిలుపునిస్తున్నామని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావుదొర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఎంపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అలాగే బంద్‌కు సహకరించాలని పాడేరు పట్టణంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహించారు.  

Updated Date - 2021-11-26T06:17:15+05:30 IST