వైసీపీ దాడులకు అదరం..బెదరం
ABN , First Publish Date - 2021-10-21T06:35:19+05:30 IST
రాష్ట్రం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండిస్తూ ఇక్కడి ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు బుధవారం నిరసన తెలిపారు.

పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా టీడీపీ ఆందోళన
వైసీపీ శ్రేణుల దుశ్చర్యలను ఎండగట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలు హాజరు
నర్సీపట్నం, అక్టోబరు 20 : రాష్ట్రం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండిస్తూ ఇక్కడి ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు బుధవారం నిరసన తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నేతృత్వంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలంతా హాజరై వైసీపీ దాడులను దుయ్యబట్టారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తి చూపించి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఇటువంటి దాడులకు అదరం, బెద రం అన్నారు. వలంటీర్ల మీద ఆధార పడిన ఏకైక ప్రభుత్వమని విమర్శించారు. ఫ్యాన్ గాలికి పెన్షన్లు ఎగిరిపోయి లబ్ధిదారులు విలపిస్తున్నారని పేర్కొ న్నారు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి, ఆ పథకాన్ని వైఎస్సార్ ఆసరా పథకంగా మార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రూ.75వేల కోట్ల హెరాయిన్ విజయవాడలోని తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోని ఒక కార్యాలయం అడ్రస్‌తో వచ్చిందని ఆరోపిం చారు. తెలంగాణ పోలీసులు విశాఖపట్నం వచ్చి ఇక్కడ గిరిజనులపై కాల్పులు జరిపితే.. ఇక్కడ ఐపీఎస్ అధికారి ఉండి ఏం చేస్తున్నారని, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టని విజయ్ప్రశ్నించారు. నియోజవర్గంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనైనా చేశారా.. అని స్థానిక ఎమ్మెల్యేనుద్దేశించి ప్రశ్నిం చారు. ఇటీవల 151 సీట్లతో నువ్వు కొడితే... మేం 160 సీట్లతో కొట్టబోతున్నాం కాసుకోండి... అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. జడ్పీటీసీ సుకల రమణమ్మ మాట్లాడుతూ టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులతో వైసీపీ పతనానికి బీజం పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి, నాతవరం పార్టీ నాయకులు నందిపల్లి వెంకటరమణ, కరక సత్యనారాయణ, కొండబాబు, మాజీ ఎంపీపీ నేతల విజయ్‌కుమార్, గొలుగొండ పార్టీ నాయకులు నానిబాబు, మాకవరపాలెం సీనియర్ నాయకులు ఎర్రాపాత్రుడు, అల్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కార్యాలయాలపై దాడులు తగదు
కృష్ణాదేవిపేట : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడితే బెదిరే పరిస్థితి లేదని గొలుగొండ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్ అన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా కృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం గ్రామాల్లో బుధవారం ధర్నా నిర్వహించి మాట్లా డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ నాయకులు లగుడు రమేష్, అప్పలనాయుడు, బొడ్డు జమీలు, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.