ఓ పక్క కరోనా భయం.. మరోపక్క జ్వరాలు

ABN , First Publish Date - 2021-05-09T04:51:24+05:30 IST

మండలంలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న మండల వాసులు మరోపక్క జ్వరాలతో సతమతం అవుతున్నారు.

ఓ పక్క కరోనా భయం.. మరోపక్క జ్వరాలు
పాతకోటలో జ్వర బాధితులు


భీతిల్లుతున్న గిరిజనులు

అనంతగిరి, మే 8: మండలంలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న మండల వాసులు మరోపక్క జ్వరాలతో సతమతం అవుతున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు ఎస్‌కోట వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకొని ఇళ్లల్లోనే చాలామంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని మారుమూల గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అవి సాధారణ జ్వరాలో, కరోనా జ్వరం అర్థం కాక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అనంతగిరి బొడ్డచెట్టు కాలనీలో ఇంటింటా జ్వర బాధితులు ఉన్నారని, వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంగరాజు శనివారం కోరారు. అదేవిధంగా రేగం, పాతకోట, మాలింగవలస గ్రామాల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు జ్వరాలతో బాధపడుతున్నారని, క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారని స్థానిక వలంటీర్‌ శ్రీను తెలిపాడు. అదేవిధంగా వాలాసీ, లుంగపర్తిలలో జ్వర బాధితులు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఇంటింటా సర్వేచేసి జ్వర బాధితులకు కొవిడ్‌ పరీక్షలు చేపట్టాలని కోరుతున్నారు.   

Updated Date - 2021-05-09T04:51:24+05:30 IST