రైతు భరోసా నగదు జమ
ABN , First Publish Date - 2021-05-14T04:52:24+05:30 IST
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం గురువారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

జిల్లాలో 3.86 లక్షల మందికి 289.88 కోట్లు
రూ.5,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ
నేడు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం గురువారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనర్‌రెడ్డి ప్రారంభించారు. విశాఖ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 3,46,679 మంది రైతులకు రూ.260 కోట్లు, అటవీ భూములు కలిగిన 39,845 మంది గిరిజన రైతులకు రూ.29.88 కోట్లు కలిపి మొత్తం 289.88 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు చెప్పారు. కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగుచేసే రైతులకు, ఇనాం భూ రైతులకు వచ్చే అక్టోబరులో రూ.11,500 చొప్పున జమ చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రైతులకు మంత్రి రైతు భరోసా చెక్కులను అందజేశారు. కాగా జిల్లాలో చాలామంది రైతులకు గురువారం సాయంత్రం రూ.5,500 చొప్పున నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖాధికారులకు సమాచారం అందింది. మిగిలిన వారికి శుక్రవారం జమ అవుతాయని, ఎక్కడైనా జమ కాకుంటే తక్షణమే సాంకేతిక సమస్యను గుర్తించి, పరిష్కరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు. కాగా, పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు శుక్రవారం రైతుల ఖాతాకు జమవుతాయని అధికారులు వివరించారు.