అప్పన్న ఆలయంలో ఉద్యోగాల పేరిట దోపిడీ?

ABN , First Publish Date - 2021-10-07T05:42:51+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ పలువురు సిబ్బంది నిరుద్యోగుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన పాలక మండలి సభ్యురాలు దాడి దేవి బుధవారం ఈవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అప్పన్న ఆలయంలో ఉద్యోగాల పేరిట దోపిడీ?

తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ ఈవోకు లేఖ రాసిన ట్రస్టీ దేవి 

సింహాచలం, అక్టోబరు 6: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ పలువురు సిబ్బంది నిరుద్యోగుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన పాలక మండలి సభ్యురాలు దాడి దేవి బుధవారం ఈవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేవస్థానం పరిధిలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ కొందరు అధికారులు, సిబ్బంది నిరుద్యోగుల నుంచి  రూ.లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దేవస్థానంలోని పోస్టుల భర్తీని పారదర్శకంగా చేయాలని, నిబంధనల మేరకు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలన్నారు. ఇప్పటికే కొన్ని డ్రైవర్‌ పోస్టులను డబ్బులు తీసుకుని భర్తీ చేసినట్టు తెలిసిందన్నారు. అటువంటి నియామకాలపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోను కోరారు. లేకుంటే  దేవస్థానంతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందన్నారు. నిబంధనలు పాటించకుండా అడ్డదారిన పోస్టులను భర్తీ చేస్తే మాత్రం ఈ అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళతానని లేఖలో స్పష్టం చేశారు.


Updated Date - 2021-10-07T05:42:51+05:30 IST