అవన్నీ ఆస్తి పన్నులో భాగమే..
ABN , First Publish Date - 2021-07-09T05:25:04+05:30 IST
ఆస్తిపన్నులో చెత్త పన్ను, తాగునీరు, మురుగునీటి పన్ను కూడా భాగమేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మ
సిరిపురం, జూలై 8: ఆస్తిపన్నులో చెత్త పన్ను, తాగునీరు, మురుగునీటి పన్ను కూడా భాగమేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మ పేర్కొన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం జీవీఎంసీ వైఖరికి వ్యతిరేకంగా విశాఖ అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రేటర్ విశాఖ రెసిడెంట్ కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ చెత్త, మంచినీటి, మురుగునీటి పన్నులు కలిపే మనం జీవీఎంసీకి ఆస్తిపన్ను రూపంలో చెల్లిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ యూజర్ చార్జీల పేరిట వీటన్నింటిపై పన్నులు భారీగా పెంచాయని విమర్శించారు. చెత్త పన్ను కింద నెలకు రూ.120 పెంచుతున్నారంటే.. రోజుకు నాలుగు రూపాయలే కదా అని ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని, దీనివల్ల ఏడాదికి ప్రజలపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ పన్ను విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నివాస్ ప్రధాన కార్యదర్శి పి.నారాయణమూర్తి, వార్వా అధ్యక్ష కార్యదర్శులు ఎన్.ప్రకాశరావు, బీబీ గణేశ్‌తో పాటు సీహెచ్ త్రినాథరావు, కేవీపీ చంద్రమౌళి, కేవీ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.