కొవిడ్‌తో చనిపోయినా....

ABN , First Publish Date - 2021-06-21T05:37:23+05:30 IST

‘దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అనే చందంగా మారింది కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి కుటుంబాల పరిస్థితి.

కొవిడ్‌తో చనిపోయినా....

ఇతర అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్టు రికార్డుల్లో నమోదు

‘కరోనా డెత్‌ సర్టిఫికెట్‌’ జారీకి ఆస్పత్రి వర్గాలు నిరాకరణ

అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్న బాధితులు

ప్రభుత్వ సాయానికి నోచుకోని మృతుల కుటుంబాలు(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదు’ అనే చందంగా మారింది కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి కుటుంబాల పరిస్థితి. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించగా, ఇందుకు అవసరమైన మరణ ధ్రువీకరణ పత్రాలను వైద్యాధికారులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు జారీ చేయడంలేదు. కరోనాతో చనిపోయిన వారిలో పది శాతం మందికి మాత్రమే కొవిడ్‌-19తో మృతిచెందినట్టు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మిగిలిన వారు ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నారు. దీంతో జిల్లాలో వందలాది బాధిత కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి సాయం అందే అవకాశం లేకుండా పోతోంది.

కరోనా మహమ్మారి బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించాయి. ముఖ్యంగా కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులను లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పాయి. ఈమేరకు జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు పిల్లల పేరిట రూ.10 లక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి, బాండ్లను వారికి అందజేశారు. ప్రతినెలా దీనిపై వచ్చే వడ్డీని పిల్లల అవసరాలకు వినియోగించుకోవాలని, 21 ఏళ్లు నిండిన తరువాత డిపాజిట్‌ సొమ్మును డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారికి నెలకు రూ.500 చొప్పున (18 ఏళ్లు నిండే వరకు) అందజేయడానికి జాబితాలను తయారు చేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో వైద్యులు, సిబ్బంది ఎవరైనా కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయాన్ని ప్రకటించింది. డాక్టర్‌ అయితే రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్స్‌ చనిపోతే రూ.20 లక్షలు, ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ అయితే రూ.15 లక్షలు, ఇతర ఉద్యోగులైతే రూ.10 లక్షలు ఇస్తామని చెప్పింది. అదే విధంగా బీసీ, ఎస్సీలకు చెందిన కుటుంబాల్లో సంపాదనపరుడైన వ్యక్తి చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆయా కార్పొరేషన్ల నుంచి రుణంగా మంజూరు చేయిస్తామని, దీనిలో లక్ష రూపాయలు రాయితీపోను మిగిలిన రూ.4 లక్షలను దశల వారీగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని ప్రకటించింది. అయితే ‘కొవిడ్‌-19’ వల్లనే చనిపోయినట్టు ఆయా బాధిత కుటుంబాలు మరణ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. 


పది మందిలో ఒక్కరికే ధ్రువపత్రం!

ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం అందాలంటే కరోనాతో చనిపోయినట్టు మరణ ధ్రువీకరణపత్రం తప్పనిసరి. వీటి కోసం బాధిత కుటుంబాలు ఆయా ఆస్పత్రులకు వెళితే.... ఇతర కారణాలతో చనిపోయినట్టు ‘డెత్‌ సర్టిఫికెట్‌’ ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... వైద్యాధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా మరణాలను గోప్యంగా ఉంచుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్యకు, అధికారిక ప్రకటనలకు ఏ రోజూ పొంతన ఉండడం లేదు. ఆయా శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు జరిగిన మృతదేహాల గణాంకాలే ఇందుకు ఉదాహరణ. కరోనా కారణంగానే చనిపోయినప్పటికీ... కార్డియాక్‌ అరెస్ట్‌ అని, మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ అని రకరకాల కారణాలను రికార్డుల్లో నమోదు చేశారు. పది మంది చనిపోతే వారిలో ఒకరో ఇద్దరో కరోనాతో చనిపోయారని, మిగిలిన వారు ఇతర వ్యాధులతో చనిపోయారంటూ రికార్డుల్లో రాసేశారు. డెత్‌ సర్టిఫికెట్‌ కోసం బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు వెళితే... రికార్డుల్లో ఏది రాశారో అదే పేర్కొంటూ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి, ఇక్కడే చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పినా తమ గోడు వినడం లేదని పలువురు వాపోయారు. ఆస్పత్రుల్లో ఇస్తున్న డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకుని, ప్రభుత్వ సాయం కోసం అధికారుల వద్దకు వెళితే... కరోనాతో చనిపోలేదని, ప్రభుత్వ సాయానికి అర్హులు కాదంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కరోనా మహమ్మారితో కుటుంబ పెద్దలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు... ఆస్పత్రుల రికార్డులో నమోదు చేసిన అవాస్తవాలను చూసి  విస్తుపోతున్నారు. 


అధికార పార్టీ నేతల పలుకుబడితో...

కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ‘కొవిడ్‌-19 డెత్‌ సర్టిఫికెట్‌’ కోసం అధికార పార్టీ నాయకులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఆయా నేతలు స్వయంగా ఆస్పత్రులకు వెళ్లి, వైద్యులు లేదా ఆస్పత్రుల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తే... అప్పుడు మాత్రమే ‘కరోనాతో చనిపోయినట్టు’ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌లో జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు అధికారుల లెక్కల ప్రకారం 470 మంది చనిపోయారు. వాస్తవంగా ఇంతకు పదింతల మంది మరణించారని ప్రజలు అంటున్నారు.  


ప్రభుత్వం స్పందించాలి 

పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్సీ, బీజేపీ

తమ కుటుంబ సభ్యులు కొవిడ్‌తో చనిపోయినప్పటికీ ఆస్పత్రుల్లో ఆ మేరకు డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదంటూ చాలా మంది మా దగ్గరకు వస్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఆయా వ్యక్తులు కరోనాతోనే చనిపోయారని భావిస్తే... సదరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి, సర్టిఫికెట్‌ ఇవ్వాలని చెబుతున్నాం. కానీ అప్పటికే రికార్డుల్లో నమోదై ఉండడం వల్ల మార్చడం వీలుకాదని అంటున్నారు. దీనిపై వైద్యవర్గాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసి, పేదలకు ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు అందే ఏర్పాటు చేయాలి. 


Updated Date - 2021-06-21T05:37:23+05:30 IST