ఎన్నికలొచ్చాయోచ్‌..!

ABN , First Publish Date - 2021-02-26T05:52:09+05:30 IST

ఆ గ్రామాలు ఒకప్పుడు పంచాయతీ పరిధిలో ఉండేవి.

ఎన్నికలొచ్చాయోచ్‌..!
కొత్తూరు నర్సింగరావుపేట వ్యూ

విలీన పంచాయతీల్లో తొలిసారి కార్పొరేషన్‌కు పోలింగ్‌

జీవీఎంసీలో కలిసిన ఎనిమిదేళ్ల తర్వాత..!

ఎన్నికలపై ఓటర్లలో నూతన ఉత్సాహం

కార్పొరేటర్లు వచ్చాకైనా అభివృద్ధి జరిగేనా..?


అనకాపల్లి రూరల్‌, ఫిబ్రవరి 2: ఆ గ్రామాలు ఒకప్పుడు పంచాయతీ పరిధిలో ఉండేవి. తర్వాత విశాఖ నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. దీనికి ఆనందపడాలో.. బాధపడాలో తెలియని మీమాంసలో ఇంతవరకూ ప్రజలు కొట్టుమిట్టాడారు. కారణం.. ఎనిమిదేళ్లుగా స్థానిక ఎన్నికలు లేక పరిపాలన గాలిలో ఉండడమే! ఫలితంగా గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయి. తాజాగా మున్సి‘పోల్స్‌’ జరగనుండడంతో వారిలో బాధపోయి నూతనోత్సాహం కనిపిస్తోంది.

మండలంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కొప్పాక, రాజుపాలెం, వల్లూరు పంచాయతీల్లో సుమారు 45 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ పంచాయతీలు 2013 వరకు పంచాయతీ పాలకవర్గం బాటలో నడిచేవి. 2013లో మహా విశాఖ నగరపాలక సంస్థలోకి విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇదిలావుండగా జీవీఎంసీలోకి విలీనమైనప్పటికీ వార్డులు విభిజించలేదు. దీంతో కార్పొరేటర్లకు కూడా ఎన్నికలు జరగలేదు. ఎనిమిదేళ్లుగా ఆయా పంచాయతీల్లో ఎన్నికల ఊసే లేకపోకపోయింది. ఫలితంగా పాలన గాలికి వదిలేయడంతో సమస్యలు, అభివృద్ధిని పట్టించుకునే నాథులే కరువయ్యారు.


ఎట్టకేలకు కార్పొరేషన్‌ ఎన్నికలు.. ఉత్సాహంగా ఓటర్లు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్‌ ఎన్నికలు రావడంతో విలీన పంచాయతీల్లోని ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు..? కార్పొరేటర్లను ఎప్పుడు ఎన్నుకుందామా అని సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న స్థానికులు, వార్డుల పునర్విభజనలో రెండు వార్డులు రావడంతో అభివృద్ధిపై ఆశలు పెంచుకున్నారు. 

ఈ మూడు పంచాయతీలను నూతనంగా కేటాయించిన 80, 84 వార్డుల్లో జతపర్చారు.  80వ వార్డులోకి రాజుపాలెం, వల్లూరు పంచాయతీల్లోని గ్రామాలను విలీనం చేశారు. అలాగే 84వ వార్డులోకి కొప్పాక పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు రాజుపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తూరు నర్సింగరావుపేట, సిరిసపల్లి గ్రామాలను కలిపారు. దీంతో మహా విశాఖ నగరపాలక సంస్థలోకి విలీనం చేసి ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే నెల 10న జరుగుతున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో తొలిసారి కార్పొరేటర్లను ఎన్నుకోనున్నారు. ఇకపై తమ గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని విలీన పంచాయతీల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆశలను కొత్తగా ఎన్నికయ్యే కార్పొరేటర్లు నెరవేరుస్తారో..? లేదో..? వేచిచూడాల్సిందే.


Updated Date - 2021-02-26T05:52:09+05:30 IST