సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తా

ABN , First Publish Date - 2021-12-30T05:58:44+05:30 IST

ఏజెన్సీలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తానని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున హెచ్చరించారు.

సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తా


ఏజెన్సీ ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్‌ తీవ్ర హెచ్చరిక

గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశం

పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశ రుసుం రూ.10 పెంపు


పాడేరు, డిసెంబరు 29: ఏజెన్సీలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తానని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మన్యంలో గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని, ఈ ప్రాంతంలో సేవలందించడం అదృష్టంగా భావించాలని,  క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు నెలకు కనీసం రెండుసార్లు ఏజెన్సీలో పర్యటించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పాడేరులో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చర్యలు చేపడుతున్నామని, అరకులోయలో మూడు నెలల్లో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాతాశిశు మరణాల నివారణ చర్యల్లో భాగంగా ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణుల కోసం ప్రతి మండలంలో ‘బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌’ నిర్మిస్తామని ఆయన చెప్పారు. డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, లిచ్చి వంటి పండ్ల తోటల సాగుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, ప్రతి మండలంలో మూడు గ్రామాలను  ఎంపిక చేసి పైలట్‌ ప్రాజెక్టు అమలు చేయాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రస్తుతం వున్న ప్రవేశ రుసుమునకు అదనంగా రూ.10 చొప్పున వసూలు చేయాలని, ఈ సొమ్ముతో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ చెప్పారు.

Updated Date - 2021-12-30T05:58:44+05:30 IST