ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలి
ABN , First Publish Date - 2021-06-01T05:10:24+05:30 IST
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు.
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన
వెంకోజీపాలెం, మే 31: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. సోమవారం ఆమె 24వ వార్డులోని నక్కవానిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు. కాలువలకు అడ్డంగా రాళ్లను పెట్టడం వల్ల నీరు నిల్వ వుంటుందని, వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా కాలువలకు అడ్డంగా రాళ్లు, జాలీలు వంటివి పెడితే ఆ ఇంటి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని ప్రధాన వైధ్యాధికారికి సూచించారు. రోడ్లు, కాలువలను రోజూ శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, జెడ్సీ శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజనీర్ చిరంజీవి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రసాదబాబు, ఏఎంవోహెచ్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.