జీవీఎంసీలో డ్రైవర్‌ ఉద్యోగాలు అమ్మకం!

ABN , First Publish Date - 2021-10-04T05:48:47+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో డ్రైవర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీవీఎంసీలో డ్రైవర్‌ ఉద్యోగాలు అమ్మకం!
బుల్లయ్య కళాశాల డేటా సెంటర్‌లో ఇళ్ల లబ్ధిదారుల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్న సిబ్బంది

ఒక్కో పోస్టుకి రూ.50 వేలు వసూలు

కొత్తగా వచ్చే 672 చెత్త సేకరణ వాహనాలకు డ్రైవర్ల నియామకం పేరిట దళారుల దందా

డ్రైవర్ల నియామకాన్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం

విషయం దాచిపెట్టి.. జీవీఎంసీలో ఉద్యోగాలంటూ మోసం 

అధికారులు దృష్టిసారించాలని యూనియన్‌ నేతలు వినతి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో డ్రైవర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెత్త తరలించడానికి త్వరలో రానున్న వాహనాలకు డ్రైవర్ల నియామకం మాటున ఈ దందాకు తెరతీసినట్టు తెలిసింది. ఇది పూర్తిగా ప్రైవేటు ఏజెన్సీకి సంబంధించిన వ్యవహారం కాగా, ఈ విషయాన్ని దాచిపెట్టి, జీవీఎంసీలో డ్రైవర్‌ ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నారు. ఒక్కో డ్రైవర్‌ పోస్టుకి రూ.50 వేల చొప్పున తీసుకుంటున్నారని జీవీఎంసీ యూనియన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కమిషనర్‌, మేయర్‌ దృష్టిసారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌)లో భాగంగా ఇంటింటికి వెళ్లి చెత్తసేకరించేందుకు జీవీఎంసీకి 672 వాహనాలను కేటాయించింది. ఇవి త్వరలో నగరానికి చేరుకోనున్నాయి. కాగా ఈ వాహనాలకు డ్రైవర్లను సమకూర్చుకునేందుకు ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. అందరికన్నా తక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీకి టెండరు అప్పగించింది. ఈ ఏజెన్సీ ప్రతినిధులు ఆయా వాహనాలకు డ్రైవర్లను సమకూర్చుకునే పనిలో పడ్డారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో వేలాది వాహనాలకు కొద్ది రోజుల వ్యవధిలో డ్రైవర్లను సమకూర్చుకోవడం సాఽద్యం కాదనే భావనతో సదరు ఏజెన్సీ ప్రతినిధులు డ్రైవర్ల నియామకం బాధ్యతను స్థానికంగా ఉండే వారికి అప్పగించారు. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తులు... జీవీఎంసీ వాహనాలకు డ్రైవర్ల నియామకం అంటూ డబ్బులు దండుకునే ప్రక్రియకు తెరలేపారు. నెలకు రూ.12 వేలు జీతం వస్తుందని చెబుతూ ఒక్కో పోస్టుకి రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ వీవీ వామనరావు విలేకరుల సమావేశం పెట్టి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. రూ.12 వేలు జీతం ఇచ్చే డ్రైవరు ఉద్యోగానికి రూ.50 వేలు ఎలా ఇస్తామని ఎవరైనా ప్రశ్నిస్తే.... భవిష్యత్తులో పర్మనెంట్‌ లేదా అవుట్‌సోర్సింగ్‌ ద్వారా కార్పొరేషన్‌లో చేర్పిస్తామని చెబుతున్నారు. వీరి మాటలు నిజమేనని నమ్మి పలువురు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మరో యూనియన్‌ నేత ఎం.ఆనందరావు కూడా డ్రైవర్‌ పోస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడిపారని, ప్రైవేటు కాంట్రాక్టర్‌ నియమించుకోవాల్సిన డ్రైవర్‌ పోస్టులకు డబ్బులు వసూలు చేయకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-10-04T05:48:47+05:30 IST