ప్రమాదమని తెలిసినా మారరే?

ABN , First Publish Date - 2021-05-31T04:49:03+05:30 IST

ఎండ తీవ్రత పెరగడంతో సేద తీరడానికి యువకులు, బాలలు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు భారీగా తరలివస్తున్నారు.

ప్రమాదమని తెలిసినా మారరే?
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఈత కొడుతున్న యువకులు

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు అధిక సంఖ్యలో యువకుల రాక

ఈత రాకున్నా నీళ్లలోకి దిగుతున్న వైనం

హెచ్చరిక బోర్డు ఉన్నా బేఖాతరు

గోపాలపట్నం, మే 30: ఎండ తీవ్రత పెరగడంతో సేద తీరడానికి యువకులు, బాలలు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు భారీగా తరలివస్తున్నారు. వారం రోజుల నుంచి రిజర్వాయర్‌ పరిసరాల్లో ఎటుచూసినా పదుల సంఖ్యలో వారే కనిపిస్తున్నారు. ఇందులో ఈత వచ్చినవారు కొందరైతే, ఈత రాకపోయినా తోటివారితో నీళ్లలో దిగేవారు మరికొందరు. రిజర్వాయర్‌లో ఈత కొట్టడం ప్రమాదకరమని సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వారు దీనిని పట్టించుకోవడం లేదు. 

ప్రమాదాలు జరుగుతున్నా.. 

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఈతకు దిగుతున్న యువకుల్లో ఏటా ఇద్దరు ముగ్గురు  ప్రాణాలు కోల్పోతున్నా రిజర్వాయర్‌లో ఈతకు దిగడం మానడం లేదు. రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇందులో సుమారు వంద మంది వరకూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వీరిలో కొందరు పరిసర ప్రాంతాలకు చెందినవారైతే, మరికొందరు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి రిజర్వాయర్‌లో ఈతకు దిగినవారే. రిజర్వాయర్‌లో ఈదడం నిషేధమని తెలిసినా ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా చాలా మంది నీళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రిజర్వాయర్‌లో ఈతకు దిగడం మానుకోవాలని రిజర్వాయర్‌ సిబ్బంది కోరుతున్నారు. 

Updated Date - 2021-05-31T04:49:03+05:30 IST