వనరుల వినియోగంతో జిల్లా సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2021-11-02T06:48:32+05:30 IST

జిల్లాలోని వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు.

వనరుల వినియోగంతో జిల్లా సమగ్రాభివృద్ధి
రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మేయర్‌ వెంకటకుమారి, కలెక్టర్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు

రూ.969 కోట్లతో గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక వసతులు

రూ.315 కోట్లతో 1130 పాఠశాలల ఆధునికీకరణ

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నిస్తామన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రగతి, పలు శాఖల పనితీరు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 4014 మంది లబ్ధిదారులకు రూ.4.41 కోట్లతో ఆర్థిక సాయం, ఉపాధి కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నాడు-నేడు కింద మొదటి దశలో రూ.315 కోట్లతో 1130 పాఠశాలలను ఆధునికీకరించామని, రెండో దశలో మరో 699 పాఠశాలల ఆధునికీకరణకు ప్రతిపాదించామన్నారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కింద రూ.348 కోట్లతో  13.78 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గృహ నిర్మాణ శాఖ కాలనీలలో రూ.969 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదించామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సింగల్‌ ఫేజ్‌ విద్యుత్‌ ఉన్న 257 గ్రామాల్లో రూ.15 కోట్లు ఖర్చు చేసి త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా పనులు జరుగుతున్నాయన్నారు. సిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ టు ట్రాన్స్‌ఫార్మ్‌, ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టెయిన్‌ పథకం కింద జీవీఎంసీలో  రూ.65 కోట్లతో 40 పాఠశాలల అభివృద్ధికి  ప్రతిపాదించినట్టు తెలిపారు. కైలాసగిరి వద్ద రూ.97 కోట్లతో ప్లానిటోరియం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. రూ.86 కోట్లతో నేచురల్‌ హిస్టరీ పార్కు అండ్‌ మ్యూజియం-రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ప్రాజెక్టు నిర్మాణ  పనులు చేపట్టేందుకు డీపీఆర్‌ తయారు చేసినట్టు వివరించారు. భీమిలి మండలం అన్నవరంలో శారదాపీఠం ఆధ్వర్యంలో వేదపాఠశాల ఏర్పాటుకు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించామన్నారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సుభద్ర, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌పీ బొడ్డేపల్లి కృష్ణారావు, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, జాయింట్‌ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పి.అరుణ్‌బాబు, పి.కల్పనాకుమారి, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు  కేకే రాజు, కోలా గురువులు, అప్పలకొండమ్మ, జాన్‌వెస్లీ, చినతల్లి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విశాఖ ఆర్డీవో కె.పెంచల కిశోర్‌ నిర్వహించారు. భీమిలి, పద్మనాభం కేజీబీవీ విద్యార్థినులతోపాటు నగరానికి చెందిన కొందరు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను, కళాకారులను కలెక్టర్‌ సత్కరించారు. 





Updated Date - 2021-11-02T06:48:32+05:30 IST