అభివృద్ధి ఆరు అడుగుల వెనక్కి

ABN , First Publish Date - 2021-05-31T04:21:40+05:30 IST

రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు జీవించే ప్రాంతం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కృషి చేయలేదనే వాదన విశాఖ మన్యంలో బలంగా వినిపిస్తున్నది.

అభివృద్ధి ఆరు అడుగుల వెనక్కి
విస్తరణకు నోచుకోని పాడేరు మెయిన్‌రోడ్డు


పాడేరు మెయిన్‌ రోడ్డు విస్తరణ హుష్‌కాకి

మంజూరైన రూ.47 కోట్లు మళ్లిన వైనం

మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి చర్యలు శూన్యం

నిర్మాణానికి నోచుకోని వెంకటేశ్వరస్వామి ఆలయాలు 

వైసీపీ సర్కారు రెండేళ్ల పాలనలో పాడేరులో అభివృద్ధి హుళక్కే

పాడేరు, మే 30: రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు జీవించే ప్రాంతం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కృషి చేయలేదనే వాదన విశాఖ మన్యంలో బలంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్‌ కేంద్రం పాడేరు రెండేళ్లుగా  అభివృద్ధి చెందకపోగా, గత ప్రభుత్వం దృష్టిసారించిన కార్యక్రమాలను సైతం కొనసాగించపోవడం గమనార్హం. పాడేరు పట్టణంలోని మెయిన్‌ రోడ్డు విస్తరణకు అనేక ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. దీంతో 2019లో అప్పటి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు మెయిన్‌ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో రూ.47 కోట్లు మంజూరు చేశారు. పాడేరులోని అంబేడ్కర్‌ కూడలి నుంచి మూడు వైపులా ఉన్న అరకులోయ, విశాఖపట్నం, చింతపల్లి మార్గాల్లో మూడేసి కిలోమీటర్ల చొప్పున మధ్యలో డివైడర్‌తో డబల్‌ రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మోదకొండమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం భావించింది. అందుకు అవసరమైన క్షేత్ర పర్యటనలు, పరిశీలనలను పూర్తయ్యాయి. రూ.కోటి వ్యయంతో మోదకొండమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే స్థానిక వెంకటగిరిపై వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అప్పట్లో అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సృజన అప్పట్లో జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో వచ్చి వెంకటగిరిని సందర్శించారు. వెంకటగిరిపై రూ.5 కోట్లతో, అరకులోయలో రూ.25 కోట్లతో వెంకటేశ్వర్‌ స్వామి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ ప్రకటించింది.

రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం

రెండేళ్ల కిత్రం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన పాడేరును అభివృద్ధి చేసేందుకు మచ్చుకైనా ఒక్క అభివృద్ధి పని చేయకపోగా.. గత ప్రభుత్వం మంజూరు చేసినవి రద్దు చేయడం విశేషం. పాడేరు మెయిన్‌ రోడ్డు విస్తరణకు రూ.47 కోట్ల మంజూరైనప్పటికీ, పనులు చేపట్టకపోగా ఆ పనినే పూర్తిగా రద్దు చేశారు. దీంతో స్థానిక మెయిన్‌రోడ్డు విస్తరణ జరగలేదు. అలాగే మోదకొండమ్మ ఆలయం అభివృద్ధి, స్థానిక వెంకటగిరిపై, అరకులోయలో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాలపై కనీసం దృష్టిసారించలేదు. వీటి సంగతి అలా ఉంచితే, మరో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రస్తుత రెవెన్యూ డివిజన్‌ కేంద్రం, భవిష్యత్‌లో జిల్లా కేంద్రం కానున్న పాడేరు పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్యానికి ముఖ్యమైన పాడేరు అభివృద్ధిపైనే సర్కారు దృష్టి సారించలేదంటే, ఇక ఏజెన్సీలో ఇతర ప్రాంతాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 

Updated Date - 2021-05-31T04:21:40+05:30 IST