రూ.110 కోట్లతో గ్రంథాలయాల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-08-25T05:45:52+05:30 IST

రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రూ.110 కోట్లు కేటాయించినట్టు పౌర గ్రంథాలయాల రాష్ట్ర సంచాలకుడు ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

రూ.110 కోట్లతో గ్రంథాలయాల అభివృద్ధి
గ్రంథాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న ప్రసన్నకుమార్‌

పౌర గ్రంథాలయాల రాష్ట్ర సంచాలకుడు ప్రసన్నకుమార్‌


అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 24: రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రూ.110 కోట్లు కేటాయించినట్టు పౌర గ్రంథాలయాల రాష్ట్ర సంచాలకుడు ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. స్థానిక శాఖవీధిలోని గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పుస్తకాలను, సిబ్బంది కొరత వివరాలను గ్రంథాలయాధికారి కె.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ నిధులతో గ్రంథాలయాల డిజిటలైజేషన్‌, కంప్యూటర్‌ ఏర్పాటు, క్యాట్‌ లాగింగ్‌ విధానాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి  భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అనకాపల్లి గ్రంథాలయానికి స్థలం కేటాయిస్తే సొంత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులను ఒప్పించి స్థలం కేటాయించేలా జిల్లా అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కె.రాధిక, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-08-25T05:45:52+05:30 IST