డెంగ్యూకు ఆరోగ్యశ్రీలో అందని వైద్యం

ABN , First Publish Date - 2021-10-28T06:04:43+05:30 IST

‘డెంగ్యూ బాధితులకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్ప త్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టండి’...ఇవీ కొద్దిరోజుల కిందట వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో స్వయంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు. కానీ, ఆ ఆదేశాలు అమలు కావడం లేదని రోగులు వాపోతున్నారు. అందుకు నిబంధనలే కారణమం టున్నారు.

డెంగ్యూకు ఆరోగ్యశ్రీలో అందని వైద్యం

ఉచితంగా చికిత్స అందిస్తామన్న సీఎం జగన్‌

క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధం

చిన్నారులకైతే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య లక్ష లోపు ఉండాలట...

పెద్దలకైతే వెంటిలేటర్‌ సపోర్ట్‌కు వెళ్లినప్పుడే...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

‘డెంగ్యూ బాధితులకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్ప త్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టండి’...ఇవీ కొద్దిరోజుల కిందట వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో స్వయంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు. కానీ, ఆ ఆదేశాలు అమలు కావడం లేదని రోగులు వాపోతున్నారు. అందుకు నిబంధనలే కారణమం టున్నారు. 

నిబంధనలతో ఉచిత వైద్యానికి నీళ్లు

జిల్లాలో సుమారు 60 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయి. వీటిలో జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్‌ ఎంప్యా నల్‌లో వున్న ఆస్పత్రులకు మాత్రమే డెంగ్యూకు వైద్యం అందించడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో ఈ ఎంప్యానల్‌ కలిగిన ఆస్పత్రులు 11 ఉన్నాయి. వీటిలో అనిల్‌ నీరుకొండ, ఆర్కే, గీతం, కిమ్స్‌, గాయత్రి, ఎల్‌జీ, మెడికవర్‌ యూనిట్‌-1, మెడికకవర్‌ యూనిట్‌-4, క్వీన్స్‌ ఎన్‌ఆర్‌ఐ, సూర్య, విజేత ఉన్నాయి. డెంగ్యూ బారినపడి ఆయా ఆస్పత్రులకు వెళ్లిన ఎంతోమంది...ఆస్పత్రి సిబ్బంది నుంచి ఎదురైన సమాధానాలతో నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్షలోపు వున్న చిన్నారులు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో వైద్యం పొందేందుకు అర్హులుగా నిబంధనల్లో పేర్కొన్నారు. అదే పెద్దలైతే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరమైతే ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందిస్తారు. ఈ రెండు నిబంధనలతో ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం పొందేందుకు అవకాశం లేకుండా పోతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రోగుల పరిస్థితి ఉండి వైద్యం పొందితే...ఒక కోడ్‌లో రూ.పది వేలు, మరో కోడ్‌లో రూ.35 వేలను ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించనుంది. వెంటిలేటర్‌ సపోర్ట్‌ వరకు వెళ్లిన రోగుల వైద్యానికి వేల రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం రూ.35 వేల రూపాయలు మాత్రమే ఇస్తోందని పలు ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో డెంగ్యూ వైద్యం పొందిన వారి సంఖ్య తక్కువగా వుండడానికి ఈ నిబంధనలే కారణమని అధికారులే పేర్కొంటున్నారు.

Updated Date - 2021-10-28T06:04:43+05:30 IST