అలంకారప్రాయంగా తాత్కాలిక రైతుబజారు

ABN , First Publish Date - 2021-06-23T04:49:11+05:30 IST

కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతుబజారు అలంకారప్రాయంగా ఉంది.

అలంకారప్రాయంగా తాత్కాలిక రైతుబజారు
ఉదయం 9.30 గంటలకు ఖాళీగా ఉన్న తాత్కాలిక రైతుబజారు

కొనుగోలుదారులు లేక వెలవెల

ఉదయాన్నే రైతులు వచ్చి అమ్మకాలు లేక తిరుగుముఖం

అధికారుల ఒత్తిడితో సతమతం

గోపాలపట్నం, జూన్‌ 22: కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతుబజారు అలంకారప్రాయంగా ఉంది. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి ఉంది. మార్కెటింగ్‌ శాఖ అధికారుల ఒత్తిడితో విక్రయాలు జరగకపోయినా రైతులు తప్పని పరిస్థితుల్లో ఈ తాత్కాలిక రైతుబజారుకు ఉదయం 6 గంటలకే వస్తున్నారు. అయితే ఉద యం 9 గంటలు అయినా కొనుగోలుదారులు రాకపోయే సరికి చేసేది లేక తెచ్చిన కూరగాయలను రైతుబజారుకు తీసుకువెళ్లి విక్రయించుకుంటున్నారు. కొనుగోలుదారులు రాని తాత్కాలిక రైతుబజారుకు రావడానికి రైతులు కూడా ఆసక్తి చూపడం లేదు. అయితే అధికారులు ఏమంటారోననే భయంతో ముందుగా తాత్కాలిక రైతుబజారుకు రావడం, కొనుగోలుదారులు రాకపోవడంతో మళ్లీ రైతుబజారుకు వెళ్లడం పరిపాటిగా మారింది. అటు ఇటు తిరగడం వల్ల సమయంతో పాటు తమకు నష్టం కూడా వస్తోందని రైతులు వాపోతున్నారు. దీనిపై మార్కెటింగ్‌ శాఖ, జీవీఎంసీ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-06-23T04:49:11+05:30 IST