కరెంట్‌ ప్రాబ్లమ్‌

ABN , First Publish Date - 2021-05-19T05:06:02+05:30 IST

ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో కచ్చితంగా 30 రోజులు వచ్చేలా రీడింగ్‌ తీస్తుంటారు. ఈసారి 35 నుంచి 40 రోజులు గడిచినా రీడర్లు రావడం లేదు.

కరెంట్‌ ప్రాబ్లమ్‌

విద్యుత్‌ బిల్లుల జారీలో తీవ్రజాప్యం

శ్లాబ్‌ మారిపోతుందని వినియోగదారుల ఆందోళన

కరోనా నేపథ్యంలో ఇంటింటికీ తిరిగేందుకు వెనుకాడుతున్న సిబ్బంది

ఇప్పటికే ఇద్దరి మృతి

వ్యాక్సిన్‌ ఇస్తే తప్ప పనిచేయలేమని స్పష్టీకరణ


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)


ఎండలు మండిపోతున్నాయి. అంతా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఓ వైపు ఏసీ...మరోవైపు అన్ని గదుల్లో ఫ్యాన్లు ఆన్‌లోనే ఉంటున్నాయి. నీటి కోసం బోరు మోటారు కూడా రోజుకు నాలుగుసార్లు వేయాల్సి వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే విద్యుత్‌ బిల్లు భారీగా వస్తుందని అంతా భయపడుతున్నారు. పులి మీద పుట్రలా ఇప్పుడు రీడింగ్‌ తీయడానికి ఎవరూ రావడం లేదు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో కచ్చితంగా 30 రోజులు వచ్చేలా రీడింగ్‌ తీస్తుంటారు. ఈసారి 35 నుంచి 40 రోజులు గడిచినా రీడర్లు రావడం లేదు. ఇంకో రెండు, మూడు రోజుల్లో వచ్చి రీడింగ్‌ తీస్తే...45 నుంచి 50 రోజుల రీడింగ్‌ వస్తుంది. దాంతో చాలామంది 500 యూనిట్ల శ్లాబులోకి వెళ్లిపోతారు. అలాగైతే యూనిట్‌కు రూ.9.50 చొప్పున చెల్లించాలి. ఇది మోయలేని భారం. ఇది తలుచుకొని వినియోగదారులు తీవ్ర అందోళన చెందుతున్నారు.


వారి పరిస్థితి వేరు


విశాఖపట్నం జిల్లాలో సుమారు 14 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి ఇళ్లకు వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీయడానికి అవుట్‌ సోర్సింగ్‌లో సుమారు 600 మంది పనిచేస్తున్నారు. ప్రతి నెలా 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో, 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మిగిలిన ప్రాంతాల్లో రీడింగ్‌ తీస్తారు. కరోనా వల్ల పీఎంపాలెంలో ఒకరు, చోడవరంలో ఒకరు రీడర్లు చనిపోయారు. దాంతో ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీయలేమని కొంతమంది చేతులెత్తేశారు. కొందరు తమకు రక్షణకు గ్లౌవ్స్‌, శానిటైజర్‌, ఫేస్‌ మాస్క్‌ ఇవ్వాలని కోరారు. ఈ బాధ్యతలను ఉన్నతాధికారులు స్థానిక డీఈలకు అప్పగించారు. కొందరు వారి స్థోమతను బట్టి అందజేశారు. కొందరు ఇవ్వలేదు. దాంతో కొందరు విధులకు హాజరు కావడం లేదు. తాము కరోనా తగ్గేంత వరకు రీడింగ్‌లు తీయలేమని చెప్పేశారు. దాంతో విశాఖ నగరం సహా జిల్లాలో అనేకచోట్ల రీడింగ్‌ తీయాల్సిన సమయం దాటి వారం రోజులైంది. ఈ నేపథ్యంలో మొదట విడత రీడింగ్‌ తీసిన వారిలో కొందరిని రెండో విడతకు వెళ్లాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఈ ప్రక్రియ 22వ తేదీతో పూర్తి కావలసి వున్నా నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. బిల్లుల జారీలో జాప్యంతో భారీ మోత తప్పదంటున్నారు.


వ్యాక్సిన్‌ ఇస్తామని మాట తప్పారు


ప్రతి ఇంటికి వెళ్లి రీడింగ్‌ తీయాలి కాబట్టి తమను కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి కరోనా వ్యాక్సిన్‌ ఇప్పించాలని వీరంతా సీఎండీ నాగలక్ష్మిని కోరారు. పదిహేను రోజుల క్రితమే ఆమె వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధ్యత కూడా ఆయా డివిజన్లకు అప్పగించారు. అయితే వ్యాక్సిన్‌ కొరత వల్ల ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీనిపై ఏ అధికారి మాట్లాడటం లేదు. 


కనీసం బీమా కూడా లేదు

రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు, రీడర్ల సంఘం


వీధుల్లో 50 ఇళ్ల బాధ్యతలు చూస్తే వార్డు వలంటీర్‌కు ఏమైనా అయితే రూ.50 లక్షల నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం వారికి బీమా సదుపాయం కల్పించింది. డిస్కమ్‌లలో రోజుకు 200 ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసే వారికి మాత్రం రూపాయి కూడా బీమా సదుపాయం లేదు. ఈ కరోనా సమయంలో పనిలో అందరికీ వెసులుబాటు కల్పించారు. రీడర్లకు మాత్రం లేదు. పైగా వారికి జరిమానా కూడా వేసి, జీతం తగ్గించేస్తారు. ఈ విధానం మారాలి.

Updated Date - 2021-05-19T05:06:02+05:30 IST