దీక్షా శిబిరం దగ్ధంపై సీపీఎం నిరసన
ABN , First Publish Date - 2021-05-25T04:59:46+05:30 IST
దీక్షా శిబిరానికి దుండగులు నిప్పంటించిన ఘటనకు నిరసనగా సీపీఎం గోపాలపట్నం డివిజన్ సభ్యులు గోపాలపట్నంలో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

గోపాలపట్నం, మే 24: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న దీక్షా శిబిరానికి దుండగులు నిప్పంటించిన ఘటనకు నిరసనగా సీపీఎం గోపాలపట్నం డివిజన్ సభ్యులు గోపాలపట్నంలో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ నేత బలివాడ వెంకటరావు మాట్లాడుతూ దీక్షా శిబిరాన్ని దుండగులు దగ్ధం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమాల్ని ఎవరూ ఆపలేరని తెలిపారు.
చినముషిడివాడలో..
పెందుర్తి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న దీక్షా శిబిరాన్ని దుండగులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల కార్యకర్తలు సోమవారం చినముషిడివాడ దరి అంబేడ్కర్ నగర్‌లో ఆందోళన చేశారు. శిబిరాన్ని దగ్ధం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఇందిర, రూపా, గీతా, వరలక్ష్మి, ఇఫ్టూ వెంకటరావు పాల్గొన్నారు.
షిప్‌యార్డు జేఏసీ ఆధ్వర్యంలో..
మల్కాపురం: దీక్షా శిబిరాన్ని దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ హిందూస్థాన్ షిప్‌యార్డు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం షిప్‌యార్డు గేటు వద్ద ధర్నా చేపట్టారు. మల్కాపురం ప్రధాన కూడలిలో ఇంటక్, సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు.