కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2021-05-22T05:06:55+05:30 IST

కరోనా రూపాంతరం చెంది రకరకాలుగా వేధిస్తోంది. కొందరిని ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే కబళిస్తోంది.

కరోనా కష్టాలు

104లో రిజిస్టర్‌ చేసుకుంటేనే నిర్ధారణ పరీక్ష

ఎన్నిసార్లు చేసినా స్పందించని కాల్‌సెంటర్‌

ప్రభుత్వ కేంద్రంలో పరీక్ష చేసుకుంటేనే మందుల కిట్‌

ప్రైవేటు ల్యాబ్‌లలో చేయించుకుంటే ఇవ్వరట

రోజుకొక నిబంధనతో రోగులకు కష్టాలు

అస్తవ్యస్తంగా వ్యాక్సినేషన్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా రూపాంతరం చెంది రకరకాలుగా వేధిస్తోంది. కొందరిని ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే కబళిస్తోంది. పరీక్షలన్నీ పూర్తిగా చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి సమయంలో కరోనా లక్షణాలు వున్నాయని ఎవరైనా సమీప ఆరోగ్య కేంద్రానికి వెళితే...వెంటనే యాంటీ జెనో, ఆర్‌టీపీసీఆరో..ఏదో ఒక పరీక్ష చేసి, తగిన మందులు ఇవ్వాల్సి ఉంది. కానీ నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఆ పరిస్థితి లేదు. కరోనా పరీక్ష చేయండని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు వెళితే...104కి కాల్‌ చేసి అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఆ విధంగానే 104కి కాల్‌ చేస్తే ఒకంతట వారు లిఫ్ట్‌ చేయడం లేదు. అనేక రోజులు...అనేకసార్లు కాల్‌ చేసి దొరకబుచ్చుకుంటే...రిజిస్టర్‌ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చి కాల్‌ కట్‌ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలనే సమాచారం ఇవ్వడం లేదు. వారం, పది రోజులు గడిచిపోతున్నా..స్పందన వుండడం లేదు. ఈలోగా లక్షణాలు కలిగిన వ్యక్తి కరోనాకు చిక్కి ఆక్సిజన్‌ పడిపోయి..ఆస్పత్రిలో చేరాల్సిన స్థితికి చేరుకుంటున్నాడు. గోపాలపట్నానికి చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలు వుండడంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళితే...104కి కాల్‌ చేయాలని చెప్పారు. అనేక సార్లు కాల్‌ చేస్తే...మూడు మెసేజ్‌లు పంపి ఊరుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు. ఏదో తంటాలు పడి ప్రైవేటుగా పరీక్ష చేయించుకుంటే...పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. అది పట్టుకొని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా మందుల కిట్‌ అడిగితే...ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చుకునే వారికే ఇస్తామని, ప్రైవేటు పరీక్షలు చేయించుకున్న వారికి ఇవ్వబోమని చెప్పి పంపించేశారు. బతికుండగా ప్రాణాలు కాపాడుకోవడానికి ఉచితంగా మందులు ఇవ్వని ప్రభుత్వం చనిపోయాక కుటుంబానికి సాయం చేస్తామని చెప్పడం విచిత్రంగా వుందని ఆ యువకుడు వాపోయారు. 


సంచార వాహనాల్లోను అదే పరిస్థితి


104 పేరుతో అంబులెన్స్‌లు ఉన్నాయి. వాటిని నగరంలోని వార్డుల్లో తిప్పుతున్నామని, కరోనా పరీక్షలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు పరీక్ష చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటున్నారు. అసలు పాజిటివ్‌ వ్యక్తినే గుర్తించడానికే నానా తంటాలు పడుతుంటే...ఇక వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది...104 వస్తుందని, అందులో చేస్తారని చెబుతున్నారు. అక్కడికి వెళితే..అక్కడ కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 


యాంటీ జెన్‌ అయితే కుదరదట!


కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష చేస్తున్నారు. అందులో పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చిన తరువాత ఓ రోగి పరిస్థితి విషమంగా మారింది. 104కి కాల్‌ చేసి ఆస్పత్రిలో చేరాలని, అంబులెన్స్‌ కావాలని అడిగితే పంపించారు. వారికి రిపోర్టు చూపిస్తే..యాంటీజెన్‌ పరీక్ష అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లబోమని, ఆర్‌టీపీసీఆర్‌ అయితేనే తీసుకువెళతామంటూ వెనుతిరిగారు. బంధువులు....ఏ పరీక్ష అయితే ఏమిటి? ఆరోగ్యం బాగా లేదు కదా? తీసుకువెళ్లండి అంటే...నిబంధనలు ఒప్పుకోవు అంటూ వారు తిరస్కరించారు. ఇలా నగరంలో కరోనా రోగులను నిబంధనల పేరుతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు.  


వ్యాక్సిన్‌ పరిస్థితీ అంతే!!


నగరంలో వ్యాక్సిన్‌ ఎక్కడ వేస్తారో..ఎవరికి వేస్తారో తెలియని గందరగోళం నెలకొని ఉంది. ఒకరేమో మీకు మెసేజ్‌ వస్తేనే రమ్మని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆధార్‌ కార్డు తీసుకువెళితే..అక్కడే చీటీ రాసి ఇచ్చి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఎటువంటి మెసేజ్‌లు రానివారు ఎంచక్కా లోపలకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకొని వెళ్లిపోతున్నారు. తాము మొదటి డోసు వేసుకొని నెల రోజులు దాటిపోయిందని, ఇంకా మెసేజ్‌ రాలేదని వెళ్లిన వారిని...మీరు ఇంకా ఆగాలి అంటూ నెట్టేస్తున్నారు. ఒక విధానం అంటూ లేకుండా అస్తవ్యస్తంగా వ్యాక్సిన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండో డోసు కోసం రాజకీయ సిఫారసులు చేసుకోవలసిన పరిస్థితి తీసుకువచ్చారు. 


గొన్నా విద్యా సంస్థల అధినేత

బొర్రా నాయుడు కరోనాతో మృతి


అగనంపూడి, మే 21: జీవీఎంసీ 85వ వార్డు పరిధి గొన్నవానిపాలెంలో గల గొన్నా ఇంజనీరింగ్‌ కళాశాల అధినేత గొన్నా బొర్రా నాయుడు (52) శుక్రవారం కరోనాతో మృతిచెందారు. కొవిడ్‌ వైరస్‌ బారినపడిన ఆయన పది రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. జీబీ నాయుడు విద్యా, వ్యాపార, రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితులు. ఏడాది వ్యవధిలో జీబీ నాయుడు కుటుంబంలో కరోనాకు ముగ్గురు బలయ్యారు. గత ఏడాది ఆగస్టులో ఆయన సోదరుడు శ్రీనివాసరావు మృతిచెందారు. 15 రోజుల కిందట ఆయన తండ్రి తాతాలు కరోనాతో ప్రాణాలు విడిచారు. ఇప్పుడు నాయుడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కరోనా కబళించడం అందరినీ కలచివేసింది.

Updated Date - 2021-05-22T05:06:55+05:30 IST