ఫ్లైఓవర్‌ పైనుంచి గడ్డర్‌లు పడిపోవడానికి.. కారణమిదే..!

ABN , First Publish Date - 2021-07-08T06:01:11+05:30 IST

జాతీయ రహదారిలోని..

ఫ్లైఓవర్‌ పైనుంచి గడ్డర్‌లు పడిపోవడానికి.. కారణమిదే..!
ప్రమాదానికి కారణమైన చెక్కలు

ముమ్మాటికీ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే...

వంతెన పిల్లర్లపై గడ్డర్లను లాకింగ్‌ చేయలేదు

చెక్క ముక్కలపై గడ్డర్లను పెట్టి వదిలేశారు

సమీపంలోనే రోడ్డు రోలర్లతో కంప్రెషర్‌ పనులు

నేలలో ప్రకంపనలు రావడంతో గడ్డర్లు పడిపోయాయని అంచనా

ప్రమాదంపై ఇప్పటివరకూ పెదవివిప్పని అధికారులు

ఏయూ ఇంజనీరింగ్‌ ఆచార్యుల పరిశీలన

పరీక్షకు గడ్డర్ల నమూనాలు 


విశాఖపట్నం: జాతీయ రహదారిలోని జలగలమదుం జంక్షన్‌ వద్ద నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్‌ పైనుంచి గడ్డర్‌లు పడిపోవడానికి కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిలో భారీ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌...కనీస రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


జలగలమదుం జంక్షన్‌ వద్ద భారీ ఫ్లైఓవర్‌ వంతెన నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా పిల్లర్‌పై పది రోజుల క్రితం సిమెంట్‌ కాంక్రీట్‌ గడ్డర్‌లు ఏర్పాటు చేశారు. కానీ వీటిని లాకింగ్‌ చేయలేదు. వాస్తవంగా గడ్డర్‌కు గడ్డర్‌కు మధ్య క్రాస్‌ గడ్డర్‌ అమర్చాలి. అందులో రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్మించి రాడ్‌బెండింగ్‌ కట్టి, వెల్డింగ్‌ చేసి కాంక్రీట్‌తో బ్లాక్‌ చేయాలి. నిర్మాణ కంపెనీ సిబ్బంది ఈ పనులు చేయకుండా...పిల్లర్లపై చెక్క ముక్కలు పెట్టి, వాటిపై గడ్డర్లను వుంచి వదిలేసింది. ఇదిలావుండగా మంగళవారం సాయంత్రం గడ్డర్‌లు నేలకొరిగిన ప్రదేశానికి సమీపంలో ఆర్డీ వాల్‌ నిర్మాణ పనుల్లో భాగంగా భారీ రోడ్‌రోలర్స్‌తో కంప్రెషర్‌ పనులు చేస్తున్నారు. దీంతో నేలలో ప్రకంపనలు ఏర్పడి, గడ్డర్‌లు పక్కకు ఒరిగి కింద పడిపోయి ఉంటాయని ఇంజనీరింగ్‌ నిపుణులు భావిస్తున్నారు. గడ్డర్లకు లాకింగ్‌ పనులు చేసివుంటే ఈ ప్రమాదం జరిగి వుండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఇదేకాకుండా గడ్డర్‌ కింద గుత్తేదారుడు ఏర్పాటుచేసిన చెక్కలు పాతవని, నాసిరకంగా ఉన్నాయని, చెక్కలు పేర్చే విధానం సక్రమంగా లేదని తెలుస్తోంది.  


నోరువిప్పని అధికారులు

ఫ్లైఓవర్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సంబంధిత అధికారులు ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. ఘటన జరిగి 24 గంటలైనా జాతీయ రహదారుల విభాగం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. నిర్మాణంలో వున్న సమయంలోనే గడ్డర్లు జారిపడడంతో వంతెన నాణ్యతపై సందేహాలు మొదలయ్యాయి. జాతీయ రహదారుల విభాగం పీడీ శివశంకర్‌, ఏయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు డీవీఆర్‌ మూర్తి, కె.శ్రీనివాసరావు బుధవారం ఉదయం ప్రమాద స్థలిని సందర్శించారు. గడ్డర్ల నుంచి కొన్ని ముక్కలు సేకరించి పరీక్షకు పంపారు. ఆ సమయంలో అక్కడే వున్న మీడియాతో మాట్లాడేందుకు పీడీ శివశంకర్‌ నిరాకరించారు. మరోవైపు నిర్మాణ పనులు చేపడుతున్న దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. కాగా వంతెన నిర్మాణ సమయంలో కాంట్రాక్టు కంపెనీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. నిత్యం వాహనాలతో రద్దీగా వుండే ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టినప్పుడు తొలుత ట్రాఫిక్‌ను మళ్లించాలి. ఇందుకు డైవర్షన్‌ రోడ్డు నిర్మించాలి. పోలీసు, రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చి అక్కడ మార్గాన్ని పూర్తిగా మూసివేయించాలి. ఈ విషయంలో ఒకవేళ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం చేసినా జాతీయ రహదారుల విభాగం జోక్యం చేసుకోవాలని రోడ్లు భవనాల రిటైర్డు ఇంజనీరు ఒకరు అన్నారు. భారీ వంతెనలు, రోడ్లు నిర్మించినప్పుడు వాహనాల మళ్లింపు అనేది తప్పనిసరన్నారు.


ఆ ట్యాంకర్‌లో క్లోరోఫాం ఉండి ఉంటే...

ఇదిలావుండగా గడ్డర్‌ పడి నుజ్జునుజ్జయిన ట్యాంకర్‌లో క్లోరోఫాం నిండుగా వుండి వుంటే భారీ ప్రమాదం సంభవించేదని వాహన డ్రైవర్‌ అన్బు చెబుతున్నాడు. క్లోరోఫాం లోడుతో తమిళనాడు నుంచి విజయనగరం వచ్చిన ట్యాంకర్‌...అక్కడ అన్‌లోడ్‌ చేసి, తిరిగి వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అదే క్లోరోఫాం నిండుగా వున్నప్పుడు ట్యాంకర్‌పై గడ్డరు పడితే ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు. 


వంతెన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  పిల్లర్లపై గడ్డర్లు అమర్చినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రమాదం చోటుచేసుకునే అవాశం వుందని ఇంజనీరింగ్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి భారీ నిర్మాణాలు చేపట్టినప్పుడు కాంట్రాక్టరు, జాతీయ రహదారి విభాగం నియమించే కన్సల్టెంట్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అనకాపల్లి వంతెనపై గడ్డర్లు అమర్చినప్పుడు జారిపడే అవకాశం ఉందా? లేదా?...అనేది పరిశీలించలేదని కొందరు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో పర్యవేక్షణ ఏదీ లేదని వ్యాఖ్యానించారు.  


డీబీసీపై ఆరోపణలు

దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కంపెనీపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. పర్మిట్లు లేకుండా ఆనందపురం ప్రాంతంలో కొండల నుంచి గ్రావెల్‌, కంకర తరలించుకుపోయిందన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు రావడంతో గనులశాఖ స్పందించి డీబీసీపై కేసు నమోదుచేసి భారీ జరిమానా వేసింది. తాజాగా అనకాపల్లి వద్ద వంతెన పై నుంచి గడ్డర్లు జారిపడి ఇద్దరు చనిపోయారు. 

Updated Date - 2021-07-08T06:01:11+05:30 IST