తీరంలో నిరంతర నిఘా!

ABN , First Publish Date - 2021-02-01T07:03:50+05:30 IST

విశాఖ నగరానికి బీచ్‌ మణిహారం... ఎక్కడెక్కడి పర్యాటకులనూ కట్టిపడేసే సుందర ప్రదేశం. వారాంతంలో నగర వాసులకు ప్రధాన సందర్శనీయ స్థలం.

తీరంలో నిరంతర నిఘా!

బీచ్‌లో మరణాల నియంత్రణకు సీపీ యాక్షన్‌ ప్లాన్‌

కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ నాలుగు పోలీసు బృందాల ఏర్పాటు

ఎత్తైన భవనాలపై నుంచి బైనాక్యులర్లతో పర్యవేక్షణ

సురక్షిత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ నగరానికి బీచ్‌ మణిహారం... ఎక్కడెక్కడి పర్యాటకులనూ కట్టిపడేసే సుందర ప్రదేశం. వారాంతంలో నగర వాసులకు ప్రధాన సందర్శనీయ స్థలం. అయితే ఇంతటి ప్రత్యేకత కలిగిన ప్రాంతం ప్రమాదాలకు కేంద్రం కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా కార్యాచరణ రూపొందించారు. 

నగరానికి వచ్చే పర్యాటకులు బీచ్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. నగరవాసులు కూడా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సముద్రంలో స్నానాలు చేసి పరవశించిపోతుంటారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. భౌగోళికంగా ఈ ప్రాంతంలో బీచ్‌ లోతు కావడంతో స్నానాలు చేసేందుకు అనుకూలం కాదని జాతీయ సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓ) తేల్చిచెప్పింది. అయినప్పటికీ సందర్శకులు ఈ ప్రాంతాల్లోనే స్నానాలకు ఉత్సాహం చూపిస్తుంటారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏటా సగటున 50 మంది వరకు బీచ్‌లో దిగి మృత్యువాత పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో బీచ్‌కు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరణాల నియంత్రణకు సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 


నాలుగు బృందాలతో గస్తీ

కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ బీచ్‌ వరకు ఏఆర్‌, మెరైన్‌, పోలీస్‌ విభాగాలకు చెందిన 157 మందిని నాలుగు బృందాలుగా విభజించి గస్తీ ఏర్పాటుచేశారు. ఒక బృందం తీరం వెంబడి తమకు కేటాయించిన ప్రాంతంలో తిరుగుతూ, సురక్షిత ప్రాంతంలోనే పర్యాటకులు బీచ్‌లో స్నానాలకు దిగేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఎవరైనా స్నానాలకు దిగితే వారిని బయటకు రప్పించాల్సి ఉంటుంది. రెండో బృందం బీచ్‌రోడ్డులో వాహనాలపై పెట్రోలింగ్‌ చేస్తూ ప్రమాదంలో వున్న వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడం, ప్రాథమిక వైద్య సేవలు అందించడం, ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమవుతుంది. బీచ్‌కు వచ్చి తప్పిపోయిన చిన్నారులను గుర్తించి కంట్రోల్‌రూమ్‌ సహాయంతో వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంది. మూడో బృందం ఎత్తైన భవనాల పై నుంచి బైనాక్యులర్స్‌తో తీరంపై నిరంతరం నిఘా ఉంచుతుంది. కెరటాల్లో ఎవరైనా చిక్కుకున్నట్టు గుర్తిస్తే వెంటనే బీచ్‌ కంట్రోల్‌రూమ్‌ ద్వారా ఆ ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. నాలుగో బృందం కంట్రోల్‌రూమ్‌కు బీచ్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూస్తుంటుంది. 


బీచ్‌ను సురక్షితం చేస్తే విశాఖ ప్రతిష్ఠ పెంచినట్టే

బీచ్‌లో మరణాలకు ఆస్కారం లేకుండా సురక్షిత ప్రాంతంగా మార్చగలిగితే నగర ప్రతిష్ఠ పెంచినట్టే. విశాఖ అనగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది బీచ్‌. ఇక్కడ ఏటా సుమారు 50 మంది వరకూ మృత్యువాత పడడం ఆవేదనకు గురిచేస్తోంది. వేసవి ప్రారంభమవుతుండడంతో బీచ్‌కు తాకిడి పెరుగుతుంది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు మెరైన్‌, ఏఆర్‌ విభాగాలతోపాటు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నాం.

-మనీష్‌కుమార్‌ సిన్హా, నగర పోలీస్‌ కమిషనర్‌ 


Updated Date - 2021-02-01T07:03:50+05:30 IST