కొనసా...గుతున్న వంతెన నిర్మాణం

ABN , First Publish Date - 2021-12-09T06:15:52+05:30 IST

గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి జాతీయ రహదారిలోని పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో వంతెన పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

కొనసా...గుతున్న వంతెన నిర్మాణం
అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

రెండేళ్లుగా పూర్తికాని పనులు

అప్రోచ్‌ రోడ్డుదీ అదే దారి!

జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం

ఎగసి పడుతున్న దుమ్ముధూళి

వాహన చోదకులు, ప్రయాణికుల అవస్థలు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 8: గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి జాతీయ రహదారిలోని పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో వంతెన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు ప్రారంభించి రెండేళ్లు పూర్తయితున్నా నేటికి పూర్తికావడం లేదు. దీంతో నిత్యం ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దీనికితోడు దుమ్ముధూళి ఎగసిపడుతుండడంతో వాహన చోదకులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

అశోక్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ 2019 డిసెంబరులో రూ.18 కోట్లతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. వంతెన పొడవు 865 మీటర్లు, వెడల్పు 28.3 మీటర్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎలమంచిలి వైపు ఉమ్మలాడ జంక్షన్‌ నుంచి విశాఖ వైపు జయభేరి షోరూం వరకు టీవోటీ విధానంలో నిర్మాణం చేపడుతున్నారు. ఆరంభం నుంచీ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ఏడాది కొవిడ్‌ కారణంగా పనులు  దాదాపు నిలిచిపోయాయి. 


దెబ్బతిన్న ప్రధాన రహదారి

వంతెన నిర్మాణానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారి కూడా ఇరువైపులా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాకుండా వర్షాలు పడే సమయంలో గంటల కొద్ది కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోతున్నాయి. రాత్రి వేళల్లో వాహనచోదకులు నరకం చూస్తున్నారు. రెండు వైపులా రహదారి దెబ్బతిన్నా నిర్మాణ సంస్థ మెరుగుపరచకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంటల తరబడి వాహనాలు రాకపోకలు స్తంభించిపోవడంతో వైసీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రహదారి మెరుగుపరిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రత్నాకర్‌ డిమాండ్‌ చేయడంతో వర్షపునీరు నిలిచిపోయే ప్రదేశంలో పనులు చేపట్టినప్పటికీ ట్రాఫిక్‌ సమస్య కొలిక్కి రాలేదు. పలు సందర్భాల్లో నిర్మాణ నిర్వాహకులు రోడ్డును బ్లాక్‌ చేయడంతో వాహనాలన్నీ విశాఖ వైపు వచ్చి జయభేరి సంస్థ వద్ద యూటర్న్‌ తీసుకొని పూడిమడక వైపు వెళ్లాల్సిన   పరిస్థితి నెలకొంది. అలాగే పూడిమడక వైపు నుంచి అనకాపల్లిలోకి వచ్చే వాహనాలు ఉమ్మలాడ జంక్షన్‌ వద్ద యూ టర్న్‌ తీసుకొని వస్తున్నాయి. పూడిమడక వైపు వెళ్లే మార్గంలో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతుండడంతో చాలా మంది ఉమ్మలాడ జంక్షన్‌ నుంచి పట్టణంలోకి వచ్చే రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో చాలా నివాస గృహాలు ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. నిర్మాణ సంస్థ  ప్రతినిధులు వంతెన నిర్మాణ  పనులను త్వరతగతిన పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-09T06:15:52+05:30 IST