‘మహా’ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయండి
ABN , First Publish Date - 2021-02-26T05:46:57+05:30 IST
జీవీఎంసీ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులను త్వరితగ తిన పూర్తిచేయాలని అధికారులను పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆదేశించారు.

రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులను త్వరితగ తిన పూర్తిచేయాలని అధికారులను పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో అమలవుతున్న ప్రాజెక్టులపై జీవీఎంసీ సమావేశమందిరంలో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూజీడీ, నీటిసరఫరా పథకాలు, ఘనవ్యర్థాల నిర్వహణ కింద చేపట్టిన ప్రాజెక్టులపై చీఫ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వరరావు, సీఎంహెచ్‌ఓ డాక్టర్ శాస్త్రిని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నుంచి చెత్తను సేకరించి వాటిని పునర్వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. చెత్త వాహనాలకు ఇండోర్ తరహాలో ట్రాకింగ్ సిస్టమ్ యాప్ ద్వారా గుర్తించే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్తను తరలించే ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని, కాపులుప్పాడలో బయోమైనింగ్ ద్వారా ఖాళీ అయిన స్థలంలో పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నగరంలో ఖాళీగా ఉన్న జీవీఎంసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవనాలను నిర్మించి ఆదాయం పెంచేందుకు కృషి చే యాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి, వీఎంఆర్ డీఏ కమిషనర్ కోటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.