కూలిన ఇల్లు.. సాయం నిల్లు

ABN , First Publish Date - 2021-11-27T04:28:47+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి ఇల్లు కూలిపోయి నిరాశ్రయురాలైన ఓ మహిళ ప్రభుత్వ సహాయం కోసం రెండు నెలలుగా ములగాడ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది.

కూలిన ఇల్లు.. సాయం నిల్లు
తుఫాన్‌కు కూలిపోయిన ఇల్లు

గులాబ్‌ తుఫాన్‌కు 40వ వార్డులో కూలిన ఇల్లు

ప్రభుత్వ సాయం కోసం రెండు నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ బాధితురాలి ప్రదక్షిణ

 హామీలిచ్చి జాడలేని అధికారులు, ప్రజాప్రతినిధులు


మల్కాపురం, నవంబరు 26 : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి ఇల్లు కూలిపోయి నిరాశ్రయురాలైన ఓ మహిళ ప్రభుత్వ సహాయం కోసం రెండు నెలలుగా ములగాడ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. సరిగ్గా రెండు నెలల క్రితం గులాబ్‌ తుఫాన్‌ విరుచుకుపడడంతో జీవీఎంసీ 40వ వార్డు కాకరలోవ బొబ్బిలివారి వీధిలో కొండను ఆనుకుని ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో ఉంటున్న రూపవతి తన మూడేళ్ల వయస్సున్న కుమారుడితో పాటు సురక్షితంగా బయటపడింది. ఇంట్లోని సామాన్లు శిథిలాల కింద ఉండిపోవడంతో కట్టుబట్టలతో బయటపడింది. శిథిలాల కింద ఉన్న సామాన్లు తీద్దామనుకుంటే కొండపై ఉన్న రాళ్లు దొర్లుకుంటూ దిగువనున్న ఇళ్లపై పడిపోయే ప్రమాదం ఉంది. కాగా ఆమె భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తన నాలుగేళ్ల వయస్సున్న కుమార్తెను శ్రీకాకుళంలో తల్లి వద్ద ఉంచి చదివిస్తోంది. ఆమె మాత్రం కుమారుడితో పాటు ఇక్కడే ఉంటోంది. ఇల్లు కూలిపోయి ఆమెకు నిలువనీడ లేకపోవడంతో ఆ ప్రాంతవాసులు చలించి ఓ పెంకుటింట్లో తలదాచుకోవడానికి ఆశ్రయమిచ్చారు. వంట పాత్రలు, నిత్యావస రాలు ఇవ్వడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 

హామీలే మిగిలాయి..

ఆమె ఇల్లు కూలిపోయినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరామ ర్శించి వెళ్లారు. ఆ ఇంటి శిథిలాలను తొలగించాలంటే ముందుగా కొండ ప్రాంతం లో రక్షణ గోడ నిర్మించాలి. కనుక రక్షణ గోడ నిర్మిస్తామని జీవీఎంసీ అధికారులు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రభుత్వ సహాయం వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సహా యం అందలేదు. స్థానిక కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు అప్పట్లో పరామ ర్శించి వెళ్లారే గానీ ఎటువంటి సహాయం అందించలేదు. ఆమె దుస్థితిని చూసి స్థానికులు చలించిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆమెకు సహాయం అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-27T04:28:47+05:30 IST