సినిమా ఫుల్‌!

ABN , First Publish Date - 2021-02-01T06:54:49+05:30 IST

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది.

సినిమా ఫుల్‌!

నేటి నుంచి థియేటర్లలో శత శాతం సీటింగ్‌కు అనుమతి

తీరనున్న ఎగ్జిబిటర్ల కష్టాలు 

కొత్త సినిమాల విడుదలకు మరింత దోహదం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి సినిమా ఽథియేటర్లలో శతశాతం సీటింగ్‌లో ప్రేక్షకులను అనుమతించేలా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో థియేటర్ల యజమానులు, సినిమా పంపిణీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామం కొత్త సినిమాల విడుదలకు దోహదపడుతుందంటున్నారు.

నగరంతోపాటు జిల్లా పరిధిలో సుమారు వందకుపైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రతి థియేటర్‌లోనూ ఏసీ, డీటీఎస్‌, సౌకర్యవంతమైన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం థియేటర్ల యాజమాన్యాలు భారీగా ఖర్చు చేశాయి. అంతేకాకుండా ఒక్కో థియేటర్‌కు విద్యుత్‌ చార్జీలు, సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అవుతుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం గత ఏడాది మార్చి 23న లాక్‌డౌన్‌ విధించింది. అప్పటి నుంచి థియేటర్లన్నీ మూతపడ్డాయి. వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత అక్టోబరు నుంచి దశలవారీగా ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఒక్కొక్కటిగా థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే 50 శాతం సీట్లలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలనే నిబంధనతో థియేటర్ల యజమానులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ కొత్త సినిమాలు విడుదలవుతుండడంతో ఎక్కువమంది థియేటర్లు తెరిచారు. తాజాగా శతశాతం ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో గతంలోలా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిణామంతో కొత్త సినిమాల విడుదలలో వేగం పెరుగుతుందని, తద్వారా లాక్‌డౌన్‌ సమయంలో ఏర్పడిన నష్టాలను కొంతవరకైనా పూడ్చుకునే అవకాశం ఉంటుందని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 

Updated Date - 2021-02-01T06:54:49+05:30 IST