రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి

ABN , First Publish Date - 2021-11-26T06:12:37+05:30 IST

నగర పరిధిలోని ఎండాడ కూడలి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీటౌన్‌ సీఐ కరణం ఈశ్వరరావు (58) మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి

ఎండాడ కూడలి వద్ద ప్రమాదానికి గురైన కారు

నగర పోలీస్‌ శాఖలో కలకలం

నైట్‌ రౌండ్స్‌ ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదం

ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొన్నట్టు అనుమానం

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు

రామభద్రపురం చెక్‌పోస్ట్‌ వద్ద ట్రాలర్‌ను గుర్తించినట్టు సమాచారం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

మరికొద్ది గంటల్లో కాశీ యాత్రకు బయలుదేరవలసి ఉండగా...


విశాఖపట్నం/కొమ్మాది, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని ఎండాడ కూడలి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీటౌన్‌ సీఐ కరణం ఈశ్వరరావు (58) మృతిచెందారు. ఆ సమయంలో వాహనం నడుపుతున్న హోంగార్డు సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.    ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సీఐ కరణం ఈశ్వరరావు బుధవారం రాత్రి నైట్‌ రౌండ్స్‌ ముగించుకుని పోలీస్‌ వాహనంలో తెల్లవారుజామున 3.45 గంటలకు మధురవాడ సమీపంలోని రేవళ్లపాలెంలో గల తన ఇంటికి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఎండాడ వద్ద ముందువెళుతున్న లేదా ఆగివున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సీఐ ఈశ్వరరావు తలకు బలమైన గాయాలు కావడంతో సీట్లోనే ప్రాణాలు విడిచారు. వాహనాన్ని నడుపుతున్న హోంగార్డు సంతోష్‌కు గాయాలవడంతో సమీపంలోని గీతం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద సమాచారం అందగానే పీఎం పాలెం ట్రాఫిక్‌ సీఐ విజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీపీ మనీష్‌కుమార్‌సిన్హా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రేవళ్లపాలెంలోని సీఐ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంకి చెందిన కరణం ఈశ్వరరావు 1986లో కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో చేరారు. 1998లో ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల పనిచేశారు. 2012లో సీఐగా పదోన్నతి పొంది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, నగరంలో త్రీటౌన్‌ ట్రాఫిక్‌, దువ్వాడ, సీఐడీ విభాగాల్లో పనిచేసి ప్రస్తుతం త్రీటౌన్‌ సీఐగా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బందోబస్తు డ్యూటీ చేసిన సీఐ ఈశ్వరరావు...రాత్రి ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో నైట్‌రౌండ్స్‌ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న రెండు వివాహాలకు కుటుంబంతో హాజరయ్యేందుకు గురువారం నుంచి 15 రోజులపాటు సెలవుపెట్టారు. అటు నుంచి కాశీ వెళదామనుకున్నారు. ఈ నేపథ్యంలో బుఽధవారం నైట్స్‌ రౌండ్స్‌ను కాస్త ముందుగానే ముగించుకుని తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ఈశ్వరరావుకి భార్య జానకి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె అమెరికాలో ఉంటున్నప్పటికీ, గురువారం మాత్రం నగరంలోని ఈశ్వరరావు ఇంట్లోనే ఉన్నారు. కుమారుడు చెన్నైలోని ఒక జాతీయ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రేవళ్లపాలెంలోని ఈశ్వరరావు నివాసం వద్ద ఉంచారు. 


ట్రాలీని ఢీకొట్టడం వల్లే ప్రమాదం!

ఎండాడ కూడలి వద్ద తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో వరుసగా మూడు భారీ ట్రాలీలు వెళుతుండగా, వెనుక వున్న ట్రాలీని సీఐ ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టినట్టు సమాచారం. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ముందు కూడళ్లలో వున్న కెమెరాల ఫుటేజీ ఆధారంగా విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లిన వాహనాల వివరాలను పోలీసులు సేకరించారు. విజయనగరం జిల్లా రామభద్రపురం చెక్‌పోస్ట్‌ వద్ద మూడు ట్రాలీలు గేటు దాటినట్టు అక్కడి సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు గుర్తించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లారు. అందులో ఒక వాహనం వెనుకభాగంలో కొంత డ్యామేజీ జరిగి వుండడంతో అదే ప్రమాదానికి కారణమై వుంటుందనే భావనతో రామభద్రపురం పరిసరాల్లో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు నగర పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆగివున్న వాహనాన్ని ఢీకొట్టడం లేదా నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని మలుపులో సకాలంలో గుర్తించలేక పోలీస్‌ వాహనం వేగంగా వెళ్లి ఢీకొట్టి వుంటుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-11-26T06:12:37+05:30 IST