చోడవరం.. చరిత్ర ఘనం!
ABN , First Publish Date - 2021-02-04T06:31:06+05:30 IST
జిల్లాలో చరిత్ర కలిగిన పంచాయతీగా చోడవరం పేరొందింది. ఈ పంచాయతీకి 132 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది.
132 ఏళ్ల గ్రామ పాలన మేజర్ పంచాయతీ సొంతం
ఎమ్మెల్యేలుగా నలుగురు ఎన్నిక.. వారిలో ఒకరు మంత్రిగా బాధ్యతలు
వార్డు సభ్యునిగా, సర్పంచ్‌లుగా చేసి ఉన్నత పదువులకు..
చోడవరం, ఫిబ్రవరి 3: జిల్లాలో చరిత్ర కలిగిన పంచాయతీగా చోడవరం పేరొందింది. ఈ పంచాయతీకి 132 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ఇక్కడ వార్డు సభ్యునిగా, సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు ప్రస్తుత మాడుగుల మండలం వీరవిల్లి తాలూకాగా ఉండే చోడవరం, కాలక్రమంలో మండల కేంద్రంగా, నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. చోడవరం, పీఎస్ పేట, రేవళ్లు, అన్నవరం శివారు గ్రామాల సమాహారమే చోడవరం మేజర్ పంచాయతీ ముఖ చిత్రం. ఇన్నేళ్ల చరిత్రలో తొలిసారిగా 2013లో దళిత మహిళకు సర్పంచ్‌గా అవకాశం లభించింది. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఎస్సీ మహిళకు రిజర్వు కావడం విశేషం.
పంచాయతీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు..
ఈ పంచాయతీ నుంచి వార్డు, సర్పంచ్‌లుగా పనిచేసిన నలుగురు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. సర్పంచ్‌గా పనిచేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కందర్ప రామేశం, గూనూరు ఎర్రునాయుడు, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఉన్నారు. అలాగే పంచాయతీలో వార్డు సభ్యుడిగా చేసిన బలిరెడ్డి సత్యారావు ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత ఆయన మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.
17 మంది సర్పంచ్‌లు
చోడవరం పంచాయతీ చరిత్రలో 17 మంది సర్పంచ్‌లుగా పనిచేశారు. మధ్యలో ఇద్దరు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. ప్రత్యేకాధికారులుగా కాసు వెంగళరెడ్డి (1935-1938), చదలవాడ సూర్యారావు (1957-1960) వ్యవహరించారు.