శాంతికి చెక్‌

ABN , First Publish Date - 2021-10-14T05:49:40+05:30 IST

జిల్లా దేవదాయ శాఖలో నెలకొన్న అశాంతిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమమ్యాయి.

శాంతికి చెక్‌
అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి

దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు చార్జిమెమో

విధి నిర్వహణలో విఫలమయ్యారని పేర్కొన్న కమిషనర్‌

తొమ్మిది అంశాలపై వివరణ కోరుతూ నోటీస్‌

సమాధానం ఇచ్చేందుకు నెల రోజుల గడువు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా దేవదాయ శాఖలో నెలకొన్న అశాంతిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమమ్యాయి.  నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదంటూ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతికి ఆ శాఖ కొత్త కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ చార్జిమెమో జారీచేశారు. ఆగస్టు ఐదో  తేదీన డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌ ముఖంపై ఆమె ఇసుక చల్లిన విషయం తెలిసిందే. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా, నాటి కమిషనర్‌ వాణిమోహన్‌ విచారణ జరపాలని రాజమండ్రి ఆర్‌జేసీ సురేశ్‌బాబును ఆదేశించారు. ఆయన ఇక్కడికి వచ్చి, అందరినీ విచారించిన సవివర నివేదికను సమర్పించారు. ప్రొబేషన్‌ పీరియడ్‌లోనే వున్న ఏసీ శాంతి, ఉన్నతాధికారిపై ఇలాంటి దాడి చేసినందుకు సస్పెండ్‌ చేస్తారని అంతా భావించారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలావుండగా ఏసీ శాంతి తమను వేధిస్తున్నారంటూ ఆమె కార్యాలయ సిబ్బంది, ఆలయ ఈఓలు పదిహేను రోజుల క్రితం సామూహిక సెలవు పెట్టి ఆందోళనలు చేశారు. అప్పుడు కూడా మళ్లీ ఆర్‌జేసీ సురేశ్‌బాబుతో విచారణ చేయించారు. ఆమె వైఖరి వల్ల నిత్యం వివాదాలు చెలరేగుతున్నాయని గుర్తించిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆర్‌జేసీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను బయటకు తీసి, దానిపై వివరణ కోరారు. మొత్తం తొమ్మిది అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వాటికి నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని నూతన కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ మంగళవారం రాత్రి ఆమెకు చార్జి మెమో ఇచ్చారు. దానికి ఆమె జవాబు ఇచ్చిన తరువాత...అదే ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.  


చార్జిమెమోలో తీవ్ర పదాలు 

ఏసీ శాంతికి జారీచేసిన చార్జి మెమోలో కమిషనర్‌ తీవ్రమైన పదాలు వాడారు. విధుల నిర్వహణలో విఫలం అయ్యారని, సిబ్బందిని టెన్షన్‌కు గురిచేస్తూ పనిచేసే వాతావరణం లేకుండా చేశారని, సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని, సిబ్బందిని అక్రమాలకు పాల్పడాల్సిందిగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.


వివరణ కోరిన అంశాలు

1. హుండీల లెక్కింపు సమయంలో పాటించాల్సిన నిబంధనలపై కమిషనర్‌ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటించడం లేదు. పైగా దిగువ స్థాయి సిబ్బందిని ఆర్థిక అక్రమాలకు  ప్రోత్సహిస్తున్నారు.

2. ఈఓ లేకుండా ధారపాలెం ధారలింగేశ్వరస్వామి ఆలయం హుండీలను తెరిచారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేని అనకాపల్లి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజును స్వయంగా తీసుకువెళ్లారు. హుండీ ద్వారా ఎంత మొత్తం వచ్చిందో రిజిస్టర్‌లో రాయకుండా, ఆ మొత్తాన్ని దూరంగా తీసుకువెళ్లిపోయారు. ఇక్కడ ఏసీగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు.

3. దేవదాయ శాఖ కమిషనర్‌ ఏప్రిల్‌ 28, 2021న ఇచ్చిన ఉత్తర్వులను అసలు పాటించ లేదు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. సర్వీసు నిబంధనలకు విరుద్ధం. 

4. దారపాలెం ఆలయం ఎలమించిలి డివిజన్‌లో ఉండగా, ఆ ఇన్‌స్పెక్టర్‌ను కాదని, ఆలయ హుండీ తాళాలను అనకాపల్లి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజుకు ఇవ్వాలని మౌఖికంగా  ఆదేశించారు. డివిజన్‌తో సంబంధం లేని ఉద్యోగికి అలా తాళాలు ఇప్పించడం విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడమే. 

5. విశాఖపట్నం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారికి మాత్రమే సీనియర్‌ అసిస్టెంట్లను, ఇన్‌స్పెక్టర్లను నియమించే అధికారం, సస్పెండ్‌ చేసే అధికారం ఉంది. కానీ ఇక్కడ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేయడమే కాకుండా ఆ విషయాన్ని డీసీకి తెలియజేయలేదు.

6. ఏసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై తరచూ కేకలు వేయడం, ఇతర సిబ్బంది ముందు అవమానపరచడం చేస్తున్నారు. ఉన్నతాధికారిననే అహంకారంతో వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పనిచేసే వాతావరణం కొరవడింది.

7. దేవాలయాల్లో రోజువారీ విధుల నిర్వహణకు అవసవరమైన నిధులు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయడానికి, ఇతర పనులకు ఈఓలకు సరైన సమయంలో అనుమతులు ఇవ్వడం లేదు. దానివల్ల ఆలయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

8. డీసీ పుష్పవర్దన్‌ తన కార్యాలయంలో సమావేశంలో ఉండగా, ఇతర అధికారుల ముందు ఆయనపై ఇసుకతో దాడి చేశారు. ఇది సీసీఏ నిబంధనలకు వ్యతిరేకం.

9. సొంత ఇష్టాలు, అభిరుచుల ప్రకారం వ్యవహరిస్తూ సమాజంలో దేవదాయ శాఖ ప్రతిష్టకు కళంకం తెచ్చేలా వ్యవహరించారు.  


రాజకీయ ఒత్తిళ్లు తెస్తే తీవ్ర పరిణామాలు

ఈ కేసు విచారణ సమయంలో ఉన్నతాధికారులను ప్రభావితం చేసేలా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా, ఇతరత్రా ప్రభావితం చేసినా వాటిని తీవ్రంగా పరిగణించి, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ జారీచేసిన మెమోలో హెచ్చరించారు. 

Updated Date - 2021-10-14T05:49:40+05:30 IST