జగనన్న కిట్లు తీసుకోలేం...

ABN , First Publish Date - 2021-05-09T04:55:10+05:30 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకునేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది.

జగనన్న కిట్లు తీసుకోలేం...

ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పంపిణీ చేయలేం

పాఠశాలల్లో వాటి భద్రతకు గ్యారంటీ లేదు 

ప్రభుత్వానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయుల స్పష్టీకరణ


విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకునేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. కొవిడ్‌ విస్తృతి, సెలవుల్లో కిట్ల భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల పునఃప్రారంభం తరువాతే కిట్లను అందజేయాలని వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ ఏటా బూట్లు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాంను కిట్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరానికి కిట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.


జిల్లాలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, ఇతర పాఠశాలలు సుమారు 4,133 వరకు ఉన్నాయి. వీటిలో 3,63,114 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలురు 1,81,921 మంది, బాలికలు 1,81,193. వీరందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందనున్నాయి. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్‌ కాంప్లెక్స్‌లకు వీటిని పంపించి, అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 260 స్కూల్‌ కాంప్లెక్స్‌లను గుర్తించారు. ఇక్కడివరకు బాగానే వున్నప్పటికీ ఈ కిట్లను ఇప్పటికిప్పుడు తీసుకునేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుకు రావడం లేదు. ఇందుకు ప్రధానంగా మూడు, నాలుగు కారణాలు చెబుతున్నారు. కొవిడ్‌ తీవ్రతతో అనేక మంది ఉపాధ్యాయులు కుటుంబాలతో సహా పాజిటివ్‌కు గురై హోమ్‌ ఐసోలేషన్‌ లేదా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలలకు వచ్చి కిట్లను తీసుకునే అవకాశం లేదంటున్నారు. దీనికి తోడు వాహనాల్లో వచ్చిన కిట్లను దించి, పాఠశాలలో వుంచేందుకు కూలీలు దొరకరని చెబుతున్నారు.  ఇంకా వేసవి సెలవుల నేపథ్యంలో కిట్లను ఇప్పుడు విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యం కాదంటున్నారు. అలాగే రూ.లక్షల విలువైన కిట్లకు పాఠశాలల్లో తగిన భద్రత ఉండదని, నైట్‌వాచ్‌మెన్‌ లేకపోవడంతో రాత్రి సమయంలో వాటి రక్షణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గతంలో పాఠశాలల్లో చోరీలు జరిగి కంప్యూటర్‌లు, ఇతర విలువైన సామగ్రి తస్కరణకు గురైన సంఘటనలను ఉదహరిస్తున్నారు. కిట్లు చోరీకి గురైతే తమను బాధ్యులను చేస్తారని, అందువల్ల వేసవి సెలవులు ముగిసిన తరువాతే పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా కానుక కిట్లను తీసుకోలేమని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. జిల్లాలోనూ కిట్లను తీసుకునేందుకు ప్రధానోపాధ్యాయులు ఎవరూ సుముఖంగా లేరని ఓ సీనియర్‌ హెచ్‌ఎం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-05-09T04:55:10+05:30 IST