ప్రశాంతంగా అప్పన్న పాలక మండలి సమావేశం

ABN , First Publish Date - 2021-10-21T05:12:11+05:30 IST

సుదీర్ఘ విరామం తర్వాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సమావేశం బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఎజెండాలోని రెండు అంశాలు మినహా మిగిలిన పదింటికి స్వల్ప చర్చల తర్వాత సభ్యులు ఆమోదం తెలిపారు. చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు అధ్యక్షతన కృష్ణాపురంలోని నృసింహవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ప్రశాంతంగా అప్పన్న పాలక మండలి సమావేశం
సమావేశంలో పాల్గొన్న సభ్యులు

ఎజెండాలోని రెండు అంశాలు మినహా మిగిలిన వాటికి ఆమోదం 


సింహాచలం, అక్టోబరు 20: సుదీర్ఘ విరామం తర్వాత  సింహాచలం దేవస్థానం పాలకమండలి సమావేశం బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఎజెండాలోని రెండు అంశాలు మినహా మిగిలిన పదింటికి స్వల్ప చర్చల తర్వాత సభ్యులు ఆమోదం తెలిపారు. చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు అధ్యక్షతన కృష్ణాపురంలోని నృసింహవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ తనకిది తొలి సమావేశమన్నారు. తన సోదరుడు ఆనందగజపతి మరణానంతరం పాలకమండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, అయితే అనంతరం కొన్ని పరిణామాలు చోటుచేసుకోవడం, కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి తాను బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించామన్నారు. అధికారులు పాలకమండలి ముందుంచిన పన్నెండు అంశాలలో రెండో అంశం అడివివరం సర్వేనంబరు 275లోని స్థలాల్లో ఆక్రమణల నిరోధానికి ఉద్దేశించిన ప్రహరీగోడ నిర్మాణం విషయంలో మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్న సభ్యుల సూచనలతో ఏకీభవించామన్నారు. హనుమాన్‌ చారిటబుల్‌ ట్రస్టు అభ్యర్థన మేరకు సీతమ్మధార   సర్వేనంబరు 275లో అదనంగా 300 చదరపు మీటర్ల స్థలం కేటాయింపును 8వ అంశంగా ప్రవేశపెట్టగా, సభ్యుల అభ్యంతరాల నడుమ పెండింగ్‌లో పెట్టామన్నారు. శ్రీనివాసనగర్‌లో చేపట్టిన నాలుగు మినీ కల్యాణమండపాల నిర్మాణాలు పూర్తిచేయడం, విద్యుత్‌, నీటి సరఫరా విడిభాగాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు ఇచ్చేందుకు, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పనుల పరిశీలన, ఽధ్రువీకరణలకు ప్రత్యేక స్వతంత్ర ఇంజినీరు నియామకానికి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ-మార్కెట్‌ ద్వారా కంప్యూటర్ల కొనుగోలుకు, నూతన ఆర్జిత సేవగా ప్రవేశపెట్టదలచిన వేదాశీర్వచన టిక్కెట్‌ ధర రూ.500గా నిర్ణయిస్తూ పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో సభ్యులు దాడి దేవి, గరుడ మాధవి, డొంకాడ పద్మావతి, సిరిపురపు ఆశాకుమారి,  వాండ్రాసి పార్వతీదేవి, వారణాసి దినేష్‌రాజ్‌, నల్లమిల్లి కృష్ణారెడ్డి, సూరిశెట్టి సూరిబాబు, రొంగలి పోతన్న, కేవీ నాగేశ్వరరావు, ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, ఎం.మురళీకృష్ణ, యండమూరి విజయ, డి.మాణిక్యాలరావు, ఎస్‌ఎన్‌ రత్నం పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T05:12:11+05:30 IST