బొమ్మ పడలేదు

ABN , First Publish Date - 2021-07-09T05:19:06+05:30 IST

వెండితెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి నెలాఖరు వరకూ నిరీక్షణ తప్పేలా లేదు. థియేటర్లను తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం పెద్ద ఆసక్తిగా లేరు.

బొమ్మ పడలేదు
జగదాంబ థియేటర్‌లో సీట్లను శుభ్రం చేస్తున్న సిబ్బంది

నెలాఖరు వరకూ తెరవబోమంటున్న మెజారిటీ థియేటర్ల యజమానులు

50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని ప్రభుత్వం షరతు

అలాగే రాత్రి తొమ్మిదిన్నరకల్లా మూసివేయాలి

విడుదలకు సిద్ధంగాలేని కొత్త సినిమాలు

ఈ కారణాలతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న ఎగ్జిబిటర్లు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

వెండితెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి నెలాఖరు వరకూ నిరీక్షణ తప్పేలా లేదు. థియేటర్లను తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం పెద్ద ఆసక్తిగా లేరు. సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలనడం, రాత్రి తొమ్మిదిన్నర గంటలకల్లా థియేటర్లను మూసేయాలన్న షరతులకు తోడు కొత్త సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో నెలాఖరు తర్వాతే థియేటర్లు ప్రారంభించాలని యజమానులు భావిస్తున్నారు. 

నగరంతోపాటు రూరల్‌ పరిధిలో సుమారు వంద వరకూ సినిమా థియేటర్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఈ ఏడాది మే మొదటివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. కేసులు తగ్గడంతో కర్ఫ్యూను అంచెలంచెలుగా సడలిస్తున్న ప్రభుత్వం గురువారం నుంచి 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉన్నందున, రాత్రి తొమ్మిది గంటలకే థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. దీనివల్ల థియేటర్లను తెరిచినా సెకండ్‌ షో ప్రదర్శనకు అవకాశం ఉండదు. కేవలం ఉదయం, మధ్యాహ్నం, ఫస్ట్‌ షో షోలను మాత్రమే ప్రదర్శించేందుకు వీలుంటుంది. ఇక సగం మంది ప్రేక్షకులతో అంటే...నిర్వహణ ఖర్చులు కూడా రావు. పైగా కొత్త సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. దీంతో ఎగ్జిబిటర్లు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో థియేటర్‌ తెరిస్తే నెలకు కనీసం రూ.ఐదు లక్షలు వరకూ ఖర్చు చేయాల్సి వుంటుందని యజమానులు అంటున్నారు.   ప్రేక్షకులు కూడా కరోనా కారణంగా ఇప్పటికిప్పుడు థియేటర్లకు రాకపోవచ్చునని, కొత్తసినిమాలు వుంటే వచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఇప్పట్లో కొత్త సినిమాలేవీ లేవు. ఈ కారణాల దృష్ట్యా నెలాఖరు వరకూ థియేటర్లను ప్రారంభించకూడదని అత్యధికులు భావిస్తున్నట్టు నగరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్‌ తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లీష్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నప్పటికీ వాటిని సింగిల్‌, డబుల్‌స్ర్కీన్‌ థియేటర్లలో ప్రతిరోజూ ప్రదర్శించడం సాఽధ్యంకాదని పేర్కొన్నారు. అలాగని వారానికి ఒక రోజు థియేటర్‌ని తెరిచి సినిమాలను ప్రదర్శిద్దామనుకున్నా, ఒకసారి థియేటర్‌ను తెరిచినా, నెలంతా తెరిచినా సరే రూ.లక్షల్లో కరెంటు బిల్లులు కట్టాల్సి వుంటుందని వివరించారు. అంతేకాకుండా షోకు ముందు, ముగిసిన తర్వాత సీట్లను శానిటైజ్‌ చేయడం, ప్రేక్షకులకు శానిటైజర్‌ అందించడం, ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చూడడం వంటివి మరింత భారమన్నారు. ఎగ్జిబిటర్లు అందరూ దాదాపు ఇదే భావనతో వున్నందున నెలాఖరు తర్వాతే థియేటర్లలో సినిమాల ప్రదర్శన ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

థియేటర్లను సిద్ధం చేస్తున్న సిబ్బంది

సినిమా థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో కొంతమంది ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను శుభ్రం చేయించే పనిలో పడ్డారు. రెండు నెలలకు పైగా థియేటర్లు మూతపడి వుండడంతో పెద్దఎత్తున ధూళి పేరుకుపోయింది. దీంతో వాక్యూమ్‌ క్లీనర్లతో సీట్లలోని ధూళిని తొలగిస్తున్నారు. కొన్ని థియేటర్లలో ఎలక్ర్టికల్‌ సమస్యలు ఏర్పడడంతో వాటిని గుర్తించి సరిచేస్తున్నారు. ఒకవేళ నెలాఖరు నాటికి కూడా సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలనే నిబంధన ఉంటే, అందుకు అనుగుణంగా మార్కింగ్‌ చేస్తున్నారు. మరికొందరు ఎగ్జిబిటర్లు అయితే మరికొంతకాలం ఎదురుచూసిన తర్వాత థియేటర్లను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

Updated Date - 2021-07-09T05:19:06+05:30 IST