బాబోయ్‌...బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-19T05:12:26+05:30 IST

ఒకపక్క జిల్లాను కరోనా మహమ్మారి కమ్మేస్తుంటే...మరోపక్క బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది.

బాబోయ్‌...బ్లాక్‌ ఫంగస్‌

అనుమానిత లక్షణాలతో నగరంలో ఓ మహిళ మృతి

మూడు రోజులు కిందట ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరిక

తాజాగా తనకు లక్షణాలు ఉన్నాయంటూ టీబీ ఆస్పత్రికి వెళ్లిన ఆరిలోవ ప్రాంత వాసి

ఇరువురూ కరోనా బాధితులే

నాలుగు రోజుల వ్యవధిలో రెండు కేసులు వెలుగుచూడడంతో ఆందోళన

వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారికి సోకే అవకాశం

కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండడం మంచిదేనంటున్న వైద్యులు

కరోనా మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని స్పష్టీకరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఒకపక్క జిల్లాను కరోనా మహమ్మారి కమ్మేస్తుంటే...మరోపక్క బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. మూడు రోజుల వ్యవధిలో బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత కేసులు రెండు నమోదు కాగా, అందులో ఒకరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. 


నగర పరిధిలోని మధురవాడ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఈ నెల మూడో తేదీన కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. దానికి చికిత్స పొందుతుండగానే..మూడు రోజుల కిందట బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యుల సలహా మేరకు నగర పరిధిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆమె మృతిచెందిన కొద్దిసేపటికే ఆరిలోవ ప్రాంతానికి చెందిన వ్యక్తి తనకు బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ పెదవాల్తేరులోని ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణకు  సమయం పడుతుందని చెప్పడంతో...ఉన్నతాధికారులను కలిసి తన సమస్యను విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరానికి చెందిన ఒక మహిళ చనిపోయిన నేపథ్యంలో అధికారులు తనకు త్వరితగతిన పరీక్షలు చేయించాలని కోరుతున్నాడు. జిల్లాలో అనుమానాస్పద కేసులుగా వెలుగుచూసిన ఇద్దరు కూడా కొవిడ్‌ బారినపడినవారే కావడం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. 


కరోనా బాధితుల్లో ఎందుకు.. 


మ్యూకోర్‌మైకోసిస్‌గా చెప్పే ఈ బ్లాక్‌ ఫంగస్‌...వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుండే ఎవరికైనా సోకే అవకాశముంది. దీన్నే రైనో ఆర్బిటో సెరిబ్రల్‌ ఇన్‌ఫెక్షన్‌గా చెబుతారు. అంటే ముక్కు, కన్ను, మెదడుకు అతి త్వరగా వ్యాపించే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌. ముందుగా ముక్కు రంధ్రం నుంచి లోపలకు వెళ్లి మిడిల్‌ టర్బినేట్‌కు, అక్కడి నుంచి సైనస్‌కి, అక్కడి నుంచి కంటికి, మెదడుకు చేరుకుని నష్టాన్ని కలిగిస్తుంది. బ్లాక్‌ ఫంగస్‌ లంగ్స్‌ లోపలకు వెళ్లి ఎంబోలిజాని (బ్లడ్‌ కాట్స్‌)కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే, అన్‌కంట్రోల్డ్‌ డయాబెటిస్‌, ఎక్కువకాలం, ఎక్కువ మోతాదులో మందులు, డోసులు వాడిన వాళ్లలోనూ, ఎక్కువ కాలం ఆక్సిజన్‌ థెరపీ, ఐసీయూలో ఉన్న, వెంటిలేటర్స్‌పై వున్న వాళ్లకు ఇది వ్యాప్తి చెందుతుంది. గతంలోనూ ఈ బ్లాక్‌ ఫంగస్‌ సమస్య ఉన్నప్పటికీ...ఇప్పుడు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం కరోనా వైరస్‌ బాధితుల్లో ఎక్కువ మంది అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌, మందులు వాడాల్సి రావడం, రోజులు తరబడి ఐసీయూ, వెంటిలేటర్స్‌పై ఉండాల్సి రావడమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్న కేసుల్లో 90 శాతం కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిగా నిపుణులు చెబుతున్నారు. మరీ, ముఖ్యంగా కొవిడ్‌ బారినపడి టొసిలిజుమాబ్‌ వంటి మందు వినియోగించే వారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 


నిర్లక్ష్యం వద్దు.. 


కరోనా నుంచి కోలుకున్న అతి కొద్దిమందిలో మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య కనిపిస్తోంది. అయితే, దీనిపట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగివుండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలు ముందస్తు హెచ్చరికగా భావించి అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కంటి, ముక్కు దగ్గర నొప్పి, ఎర్రదనం, జ్వరం, తలనొప్పి, ముఖం వాపు, బుగ్గలు, కళ్లు, ముక్కు తిమ్మిర్లు పట్టడం, పంటి నొప్పి, ముక్కు పొడిబారడం, ముక్కులో నుంచి నల్లగా ద్రవం కారడం, ఒకవైపు ముక్కు మూసుకుపోవడం, ఛాతీలో నొప్పి రావడం, ఒకవైపు తలనొప్పి వుంటే వెంటనే అనుమానించి వైద్యులను సంప్రతించాలని సూచిస్తున్నారు. వీరి ముక్కు నుంచి స్వాబ్‌ తీసి ఫంగల్‌ కల్చర్‌ పరీక్షకు పంపించి వ్యాధిని నిర్ధారిస్తారు. సైనస్‌ను సిటీ స్కాన్‌, కన్ను, బ్రెయిన్‌కు ఎంఆర్‌ఐ, ముక్కుకు ఎండోస్కోపీ చేయడం ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ను నిర్ధారించేందుకు అవకాశముంది. సకాలంలో గుర్తించినట్టయితే యాంఫో టెరిసిన్‌ బి అనే ఇంజక్షన్‌, పోసోకోనాజోలె అనే మందు ఇవ్వడం ద్వారా,  లేదంటే సర్జీరీ ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను తొలగిస్తారు. 


అపోహలు వద్దు.. 


బ్లాక్‌ ఫంగస్‌పై అపోహలు వద్దని, కరోనా మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని బారినపడితే కొంత ప్రమాదమేనని, అయితే సకాలంలో గుర్తించడం చాలా కీలకమని చెబుతున్నారు. 


చర్యలు ఏవీ..?


జిల్లాలో మూడు రోజులు కిందట బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత లక్షణాలతో ఒక కేసు నమోదైనప్పటికీ.. జిల్లా యంత్రాంగం సదరు కేసుపై దృష్టి సారించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని  పాలకులు చెబుతుంటే...క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టిసారించాల్సిన అవసరముందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. 


దీర్ఘకాలంగా మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి

- డాక్టర్‌ రాంబాబు, విమ్స్‌ డైరక్టర్‌


కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తున్నట్టు అధ్యయనాలు, కొన్నిచోట్ల నమోదవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి కోలుకున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రతించాలి. అతి కొద్దిమందిలో మాత్రమే ఈ సమస్య కనిపిస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. రోజుల తరబడి వెంటిలేటర్‌, ఐసీయూలో ఉండి, ఇతర అనారోగ్య సమస్యలకు దీర్ఘకాలంగా మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి.


మరో 2,368 కరోనా కేసులు

కోలుకున్నవారు 2,671 మంది


విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మంగళవారం 2,368 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో  మొత్తం కేసుల సంఖ్య 1,17,313కు చేరింది. ఇందులో 95,708 మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,671 మంది కొవిడ్‌ నుంచి బయటపడ్డారు. కాగా చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 788కు చేరింది. ప్రస్తుతం 20,817 మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. 



Updated Date - 2021-05-19T05:12:26+05:30 IST