‘భూయజ్ఞం’పై ఆరా

ABN , First Publish Date - 2021-10-29T06:00:41+05:30 IST

బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో వైసీపీ బడాబాబులు భూములు చదును చేస్తున్న వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది.

‘భూయజ్ఞం’పై ఆరా
విస్సన్నపేట భూముల్లో మ్యాప్‌ పరిశీలిస్తున్న సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల ఏడీ, మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు

విస్సన్నపేట భూముల్లో సర్వే, మైనింగ్‌, రెవెన్యూ అధికారుల పర్యటన

రికార్డులు, ల్యాండ్‌ మ్యాప్‌ల పరిశీలన

శాఖల వారీగా రీ సర్వే చేయనున్నట్టు వెల్లడి


కశింకోట, అక్టోబరు 28: బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో వైసీపీ బడాబాబులు భూములు చదును చేస్తున్న వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. సర్వే నంబరు 195/2లో అనుమతులు లేకుండా వందలాది ఎకరాల భూములను చదును చేయడంపై ‘గప్‌చుప్‌గా భూయజ్ఞం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా భూములు చదును చేస్తున్నారని, అడ్డం వచ్చిన వాగులు, గెడ్డలు కప్పుతున్నారని, అసైన్డ్‌ భూముల్లోరహదారులు వేస్తున్నారని జిల్లా సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో కలెక్టర్‌ మల్లికార్జున, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి స్పందించారు. అధికారుల ఆదేశాలతో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల సహాయ సంచాలకుడు ఆర్‌.విజయ్‌కుమార్‌, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.సునీల్‌బాబు, అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామారావులు తమ శాఖల ఉద్యోగులతో గురువారం ఆయా భూముల్లో పర్యటించి రికార్డులను పరిశీలించారు. ల్యాండ్‌ మ్యాప్‌ల ఆధారంగా భూములను చూశారు. భూములను మరోసారి రీ సర్వే చేయనున్నట్టు వారు తెలిపారు. 

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖలు భూములపై వేర్వేరుగా అధ్యయనం చేయనున్నట్టు అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామారావు ఈ సందర్భంగా తెలిపారు. కొండలు, గ్రావెల్‌ తవ్వకాలపై గనుల శాఖ అధికారులు, భూమి పరంగా రెవెన్యూ అధికారులు, ఆక్రమణలు పరంగా సర్వేయర్లు గుర్తిస్తారని ఆయన చెప్పారు. తదుపరి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కశింకోట తహసీల్దార్‌ బి.సుధాకర్‌, మండల సర్వేయర్‌ కె.దినేశ్‌, మైనింగ్‌ సర్వేయర్‌ ఆర్‌.అమ్మాజీ, ఇతర సర్వేయర్ల బృందం పర్యటించింది.

Updated Date - 2021-10-29T06:00:41+05:30 IST