భూ దందాపై మంత్రి సీరియస్‌

ABN , First Publish Date - 2021-10-31T06:03:09+05:30 IST

ఆనందపురం మండలం గండిగుండంలో ప్రైవేటు లేఅవుట్‌ కోసం ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మాణం చేపట్టడంపై రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

భూ దందాపై మంత్రి సీరియస్‌

 అధికారులపై ఆగ్రహం, విచారణకు ఆదేశంవిశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆనందపురం మండలం గండిగుండంలో ప్రైవేటు లేఅవుట్‌ కోసం ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మాణం చేపట్టడంపై రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వైసీసీ నేత భూదందా’ శీర్షికతో శనివారం ‘ఆంరఽధజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. శనివారం ఉదయమే ఆనందపురం మండలానికి చెందిన పార్టీ నేతలకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఆ తరువాత ఆనందపురంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి...అక్కడ పార్టీ నేతలను పిలిచి భూదందాలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరూ వ్యవహరించవద్దని స్పష్టంచేశారు. తరువాత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆనందపురం తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గండిగుండంలో    నిర్మించిన రోడ్డు నిర్మించిన స్థలం ప్రభుత్వానిదేనని పేర్కొంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు.


అప్రోచ్‌ లేకుండా లేఅవుట్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?

వాస్తవానికి అప్రోచ్‌ రోడ్డు చూపిస్తేనే లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలి. అలాంటిది రహదారి లేకుండా గండిగుండం పంచాయతీ అధికారులు ఈ లేఅవుట్‌కు ఎలా అనుమతి ఇచ్చారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి...ఒకవేళ ప్రైవేటు భూమి లేకుండా, ప్రభుత్వ భూమి మాత్రమే వున్నట్టయితే రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం అంగీకరిస్తే రోడ్‌కు అవసరమైన స్థలం కోసం మార్కెట్‌ విలువ ప్రకారం డబ్బు చెల్లించాలి. అటువంటిదేమీ లేకుండానే అధికార పార్టీ నేత ఏకంగా ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారు. దీనిపై గండిగుండం గ్రామ కార్యదర్శి, వీఆర్వో వివరణకు యత్నించగా ఫోన్‌లు లిఫ్ట్‌ చేయలేదు.

Updated Date - 2021-10-31T06:03:09+05:30 IST