భగ్గుమన్న తెలుగు మహిళలు

ABN , First Publish Date - 2021-11-21T05:53:52+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు భగ్గుమన్నారు.

భగ్గుమన్న తెలుగు మహిళలు
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెలుగు మహిళలు

సీతమ్మలాంటి మహిళపై నోరు పారేసుకుంటే ఊరుకోం.. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిద్రపోం

సీఎం, మంత్రుల ఫొటోలను చెప్పులతో కొడుతుండగా అడ్డుకున్న పోలీసులు 

భీమిలిలో టీడీపీ నాయకులు శాంతియుత ప్రదర్శన

సిరిపురం, నవంబరు 20: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు భగ్గుమన్నారు. దేవతామూర్తుల విగ్రహాలనే ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు, ప్రభుత్వం.. దేవాలయంలాంటి అసెంబ్లీని గౌరవిస్తారని అనుకోవడం రాష్ట్ర ప్రజల భ్రమేనని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అన్నారు. అసెంబ్లీలో సీతమ్మలాంటి నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం టీడీపీ విశాఖ పార్లమెంట్‌ మహిళా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమ్రంతి నందమూరి తారకరామారావు కుమార్తె, నారా వారి కోడలైన భువనేశ్వరిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం, మహిళాలోకం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలలోని ముఖ్యమంత్రుల తీరు ఎలా ఉంది, ఏపీలోని సీఎం తీరు ఎలా ఉందో అందరూ చూస్తున్నారని, ముఖ్యమంత్రే ఈ విధంగా ఉంటే ఇక మంత్రులు ఇంకెలా ఉంటారో అర్ధం చేసుకోవచ్చునని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని, అసెంబ్లీలో రాసలీలల ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మంత్రి కొడాలి నాని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు నిద్రపోమన్నారు. భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వారి తల్లులకు, భార్యాబిడ్డలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


తెలుగు మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం

నిరసనలో భాగంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఫొటోలను తెలుగు మహిళలు చెప్పులతో కొట్టేందుకు, వాటిని చింపేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని బలవంతంగా ఫొటోలను లాక్కున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మహిళలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి గనగల్ల సత్యవతి, సుజాత, అరుణ, లీలావతి, రాధాకుమారి, ఉమరాణి, తదితరులు పాల్గొన్నారు.


భీమునిపట్నం: అసెంబ్లీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం టీడీపీ నాయకులు,  కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, పలువురు నలుపు దుస్తులు ధరించి చిన్నబజారులోని పార్టీ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో కోరాడ రాజబాబు మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యపై చర్చ జరుగుతున్నపుడు సీఎం కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కడ బయటపడుతుందనే యోచనతో చర్చను పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఓ మహిళ గురించి నీచంగా మాట్లాడే వైసీపీ నాయకులు మహిళా సాధికారత కోసం మాట్లాడుతుండడం శోచనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ మహిళలను గౌరవించే సంస్కారం లేని వైసీపీ నాయకులకు తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడంలో అర్థం లేదని దుయ్యబట్టారు. మహిళా కార్పొరేటర్లు గాడు చిన్నికుమారిలక్ష్మి, మొల్లి హేమలత, పిళ్లా మంగమ్మలు మాట్లాడుతూ స్త్రీమూర్తిపై వ్యాఖ్యలు చేసిన వారికి పురాణాల్లో పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పీవీ నరసింహం, నాయకులు బోయి రమాదేవి, కురిమిన లీలావతి, అరుణ, పాసి నరసింగరావు, మొల్లి లక్ష్మణరావు, ఆనంద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


సింహాచలం: రాజకీయాలపై, ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం జగన్‌కు మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే టీడీపీ అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని 98వ వార్డు కార్పొరేటర్‌ పిసిని వరాహనరసింహం డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ టీడీపీ వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టి ప్రభుత్వానికి, సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్నాల ధర్మ, గండ్రెడ్డి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-21T05:53:52+05:30 IST