విశాఖ ‘కొండగుడి’కి పోటెత్తిన విశ్వాసకులు

ABN , First Publish Date - 2021-12-09T04:46:38+05:30 IST

విశాఖ నగరం పాత పోస్టాఫీస్‌ సమీపంలోని కొండగుడి (రోస్‌ హిల్స్‌)కు బుధవారం విశ్వాసకులు పోటెత్తారు. ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక మందిరం కొండగుడి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.

విశాఖ ‘కొండగుడి’కి పోటెత్తిన విశ్వాసకులు
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విశ్వాసకులు

అంగరంగ వైభవంగా జరిగిన వార్షిక ఉత్సవం

అమలోద్భవి మాతను దర్శించుకున్న లక్షలాది మంది

విశాఖపట్నం, డిసెంబరు 8: విశాఖ నగరం పాత పోస్టాఫీస్‌ సమీపంలోని కొండగుడి (రోస్‌ హిల్స్‌)కు బుధవారం విశ్వాసకులు పోటెత్తారు.  ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక మందిరం కొండగుడి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత నుంచి విశ్వాసకుల రాకతో పాతపోస్టాఫీసు పరిధిలోని రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయానికే పాతపోస్టాఫీస్‌ నుంచి కొండగుడి వరకు భారీగా జనం బారులు తీరారు. సాయంత్రానికి కొండగుడి విశ్వాసకులతో కిక్కిరిసిపోయింది. 


మేరీమాత ఉత్సవానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి విశ్వాసకులు భారీగా తరలివచ్చారు. యేసయ్యకు జన్మనిచ్చిన మేరీమాతను కనులారా దర్శించి పులకించిపోయారు. తెల్లవారు జామున 4.30 గంటలకు దేవాలయంలో ప్రార్థనలు ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు విశాఖ అగ్రపీఠాధిపతి బిషప్‌ మల్లవరపు ప్రకాష్‌, పూల ఆంథోనీల ఆధ్వర్యంలో ఆంగ్లంలో, తెలుగులో దివ్యబలులు నిర్వహించారు. 


మోక్ష పతాకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు నిర్వహించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.  గుహ వద్ద చర్చి ఫాదర్ల సమక్షంలో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు తెలుగులో దివ్యపూజ బలి జరిపించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రెవరెండ్‌ ఫాదర్‌ పి.ఇన్నారెడ్డి ఉత్సవ ప్రాధాన్యంపై విశ్వాసకుల నుద్దేశించి ప్రసంగించారు. విశ్వాసకుల్లో మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. 


అనంతరం 155 ఏళ్ల చరిత్ర ఉన్న కొండగుడిపై కొలువుదీరిన విశాఖ పురి మేరీమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. మాతను కనులారా దర్శించి విశ్వాసకులు పులకించిపోయారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు మేరీమాతను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భారీగా తరలిరానున్న విశ్వాసకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఐదు వందల మంది వలంటీర్లను నియమించి విశ్వాసకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. 


కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేశారు. మాస్క్‌ ఉన్న వారిని మాత్రమే కొండమీదికి పంపించారు. సాయంత్రం నాలుగు గంటలకు ‘తేరు ప్రదర్శన, ఆరాధన’ కార్యక్రమాలు నిర్వహించారు. పతాకాన్ని అవనతం చేయడం ద్వారా ఉత్సవాలు ముగిసాయి. ఫుణ్యక్షేత్ర డైరెక్టర్‌ కొండాల జోసెఫ్‌, పక్కి దిలీప్‌కుమార్‌, మైఖెల్‌ ఒలికల్‌, రెవరెండ్‌ఫాదర్‌ బి.సురేష్‌బాబు, కోశాధికారి రెవరెండ్‌ ఫాదర్‌ భాస్కరరెడ్డి, కొటక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జె.ఎల్‌.రవికుమార్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


విశ్వాసకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు సత్ఫలితం ఇచ్చాయి. అటు కొత్తరోడ్డు, ఇటు చిలకల కూడలి వరకు మాత్రమే ఆటోలను అనుమతించారు. విశ్వాసకులు కాలినడకన కొండకు చేరుకునేందుకు వీలుగా ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించి ఖాళీ చేయించారు.   


Updated Date - 2021-12-09T04:46:38+05:30 IST