బడిలో అందాల బొమ్మలు
ABN , First Publish Date - 2021-06-07T05:22:18+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలకు తన కళా నైపుణ్యం ద్వారా గురువులు కొత్త కళను తెచ్చి పెడుతున్నారు.
‘నాడు- నేడు’లో పలు పాఠశాలలు అభివృద్ధి
తుది దశకు చేరుకోవడంతో గోడలపై ఆకట్టుకునేలా చిత్రాలు
జిల్లాలో 171 మంది కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్లకు బాధ్యతలు
నర్సీపట్నం, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలలకు తన కళా నైపుణ్యం ద్వారా గురువులు కొత్త కళను తెచ్చి పెడుతున్నారు. నాడు- నేడు మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 1149 పాఠశాలల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ నెల 20లోగా పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పాఠశాల భవనాలకు పెయింటింగ్ పనులు దశకు చేరుకున్నాయి. వీటి గోడల మీద చిత్రాలు వేసే బాధ్యతలను కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్లకు అప్పగించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్లు అదే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలకు చేరిన వెంటనే ఆకట్టుకునేలా అందమైన బొమ్మలు గీస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్‌పై పిల్లల్లో అవగాహన పెంచే చిత్రాలు, పిల్లలు ఆడుకునే రకరకాల ఆటలుకు సంబంధించిన చిత్రాలు అత్యద్భుతంగా గోడలపై వేస్తుండడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తు న్నారు. నర్సీపట్నంలో నాడు- నేడు పనులు జరిగిన 18 పాఠశాలల్లో గోడ మీద చిత్రాలు వేయాల్సిన బాధ్యతను విద్యాశాఖ ఏడుగురు ఒప్పంద డ్రాయింగ్ టీచర్లకు అప్పగించారు. ఇప్పటికే ఐదు పాఠశాలల్లో వాల్ ఆర్ట్స్ వేయడం పూర్తయ్యిందని, నాలుగు రోజుల్లో అన్ని పాఠశాలల్లో చిత్రాలు వేయడం పూర్తిచేస్తామని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు పేరూరి శ్రీనివాసరావు తెలిపారు.