వైసీపీ నేతలతో మంచిగా ఉండండి

ABN , First Publish Date - 2021-12-26T06:18:43+05:30 IST

‘మీరు కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీకి, ఆ పార్టీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వరు. వారితో మంచిగా వుంటూ పనులు చేయించుకోండి’

వైసీపీ నేతలతో మంచిగా ఉండండి

అవసరమైన పనులు చేయించుకోండి

టీడీపీ కార్పొరేటర్లకు జీవీఎంసీ అధికారి సలహా

కౌన్సిల్‌లో వ్యతిరేకంగా మాట్లాడితే మీ వార్డులకు నిధులు ఇవ్వరంటూ బెదిరింపు

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు

ఇలాగైతే ప్రజా సమస్యల పరిష్కారం ఎలాగని ప్రశ్నిస్తున్న విపక్ష కార్పొరేటర్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘మీరు కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీకి, ఆ పార్టీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వరు. వారితో మంచిగా వుంటూ పనులు చేయించుకోండి’

...ఇదీ వార్డులో సమస్యను వివరించేందుకు వెళ్లిన ఓ టీడీపీ కార్పొరేటర్‌కు జీవీఎంసీ రెవెన్యూ విభాగంలోని ఒక అధికారి ఇచ్చిన సలహా.


ఒక్క రెవెన్యూ విభాగంలోనే కాదు...మిగిలిన విభాగాల్లో కూడా కొంతమంది అధికారులు ఇదే తరహాలో విపక్ష కార్పొరేటర్లకు సలహా ఇస్తున్నారు.


మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని కొన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు...అధికార పార్టీ నేతల మెప్పు కోసం పాకులాడుతున్నారు. జీవీఎంసీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను టీడీపీ, జనసేన, వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో తూర్పారబడుతున్నారు. దీంతో కాంట్రాక్టులు, మద్యం వ్యాపారంంలో వున్న విపక్ష కార్పొరేటర్లను అధికార పార్టీ నేతలు బెదిరించి తమ దారికి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనూ ఇద్దరు, ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. మరికొందరు మాత్రం వ్యాపారాలు వున్నప్పటికీ అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా తట్టుకుని నిలబడ్డారు. అంతేగాకుండా కౌన్సిల్‌ సమావేశాల్లో అధికార పార్టీ నేతల అక్రమాలు, అధికారుల అవినీతిపై నిలదీస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో తమకు అనుకూలంగా వున్న అధికారులను పిలిచి విపక్ష కార్పొరేటర్లను నయానోభయానో దారికి తీసుకురావాలని పురమాయిస్తున్నారు. ఈ నెల పదో తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో జోన్‌-5తోపాటు జోన్‌-8లో అసెస్‌మెంట్ల జారీలో జరిగిన అవకతవకలపై విపక్ష కార్పొరేటర్లు నిలదీశారు. ఆధారాలు చూపించడంతో అధికార పార్టీ కార్పొరేటర్లు, అధికారులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. సమావేశం అనంతరం జీవీఎంసీలో చక్రం తిప్పుతున్న నేత ఒకరు రెవెన్యూ విభాగంలో కీలక అధికారిని మేయర్‌ ఛాంబర్‌కు పిలిచి క్లాస్‌ పీకినట్టు తెలిసింది. ‘మాకు అనుకూలంగా ఉంటానని మాటివ్వడం వల్ల నిన్ను ఇక్కడకు తీసుకువస్తే...కౌన్సిల్‌లో విపక్ష కార్పొరేటర్ల ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకుండా కూర్చొని మమ్మల్ని తలదించుకునేలా చేశావ్‌’...అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. అదేరోజు సాయంత్రం టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు రెవెన్యూ విభాగానికి వెళ్లగా...సదరు అధికారి వారిని పిలిచి అధికార పార్టీ కార్పొరేటర్లకు ఎదురుచెబితే నిధులు మంజూరు చేయరని, కాబట్టి, వారికి అనుకూలంగా వుండాలని సలహా ఇచ్చారు. దీంతో అవాక్నైన వారిద్దరూ తమ వార్డులకు ఎలా నిధులు మంజూరుచేయరో తాము చూసుకుంటామని, ప్రజల పక్షాన పోరాటం చేయకుండా మాత్రం వుండలేమని తెగేసి చెప్పిట్టు సమాచారం. అలాగే గోపాలపట్నం ప్రాంతానికి చెందిన టీడీపీ కార్పొరేటర్‌ ఒకరు మెటీరియల్‌ కాంట్రాక్టు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపడుతుంటారు. కొన్నాళ్ల కిందట జరిగిన కౌన్సిల్‌లో ఆ కార్పొరేటర్‌ దుకాణాల లీజులపై గట్టిగా నిలదీశారు. దీంతో సదరు కార్పొరేటర్‌ వద్దకు టౌన్‌ప్లానింగ్‌కు చెందిన ఆ జోన్‌ అధికారిని పంపించి, గతంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన లొసుగులను వివరించి బెదిరించే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని సదరు కార్పొరేటర్‌ తమ పార్టీకి చెందిన ఇతర కార్పొరేటర్లకు చెప్పారు. వారంతా ధైర్యం చెప్పినప్పటికీ ప్రస్తుతం డోలాయమాన పరిస్థితిలో ఉండిపోయారు. జీవీఎంసీలో పలు విభాగాల అధికారులు ఇదే తరహాలో అధికార పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తూ...విపక్షాలకు చెందిన కార్పొరేటర్లపై సహాయ నిరాకరణ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుతో తాము మనస్సాక్షిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయలేకపోతున్నామని విపక్ష కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Updated Date - 2021-12-26T06:18:43+05:30 IST