రాజుపేటలో రణరంగం

ABN , First Publish Date - 2021-10-07T06:30:50+05:30 IST

పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు రణరంగాన్ని తలపిం చాయి. మునగపాక మండలం రాజుపేటలో బుధవారం వైసీపీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో గ్రామ సర్పంచ్‌ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజుపేటలో రణరంగం
రాజుపేటలో ఘర్షణ పడుతున్న దృశ్యం


 యూపీ పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

 కొట్లాటకు దిగడంతో సర్పంచ్‌ సహా పలువురికి గాయాలు

 ఒకరి పరిస్థితి ఆందోళనకరం

మునగపాక, అక్టోబరు 6: పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు రణరంగాన్ని తలపిం చాయి. మునగపాక మండలం రాజుపేటలో బుధవారం వైసీపీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో గ్రామ సర్పంచ్‌ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇందుకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి. గత నెలలో జరగా ల్సిన రాజుపేట ఎంపీయూపీ స్కూల్‌ పేరెంట్స్‌ కమిటీ ఎన్నిక పలు కారణాల రీత్యా వాయిదా పడింది. బుధవారం ఈ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. మూడు, నాలుగు, ఐదు, ఆరు తరగతులకు కమిటీ ఎన్నికలు సజావుగా సాగాయి. ఒకటి, రెండు, ఏడు తరగతులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, కోరం లేక వాయిదా పడ్డాయి. దీంతో పాఠశాల బయట వున్న వైసీపీలోని ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి.   సర్పంచ్‌ కిల్లాడి దేముళ్లుపై దాడి దిగడంతో, ఆయనకు గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి యత్నించిన సర్పంచ్‌ బంధువు సారిపల్లి భాస్కరరావుకు తలపై తీవ్ర గాయమైంది. దీంతో అతనిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కిల్లాడి దేముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా తనపై పోటీ చేసి ఓడి పోయిన డి.అప్పలనాయుడు మారణాయు ధాలతో రౌడీలను తీసుకువచ్చి బీభత్సం సృష్టిం చాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాలలో అప్పలనాయుడుకు సంబంధించిన వారెవరూ లేకపోయినప్పటికీ అనుచరులను తీసుకువచ్చి  హత్యాయత్నం చేశాడని ఆరోపించారు.  తక్షణమే అతనిపైన, అతని అనుచరుల పైన హత్యా యత్నం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.  పాఠశాల సమీపంలోనే ఘర్షణలు తలెత్తినందున ఒకటి, రెండు, ఏడు తరగతులకు కమిటీ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు హెచ్‌ఎం పి.నాగభూషణం ప్రకటించారు.

బడిలో బాహాబాహీ!

నాతవరం: పాఠ శాల పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కోట్లాట చోటుచే సుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఒక్కొక్కరు గాయపడడంతో పరస్పరం నాతవరం పోలీసులకు ఫిర్యా దులు చేసుకున్నారు. చివరకు గ్రామ పెద్దల సూచనల మేరకు ఇరువురూ కేసులను విత్‌డ్రా చేసుకున్నారు. మం డలంలోని శరభూపాలపట్నంలో జరి గిన ఈ ఘటనకు సంబంధించిన వివ రాలివి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఈ కమిటీ ఎన్నికలను అధికారులు జరిపినప్పటికీ అప్పుడు ఇక్కడ ఘర్షణ జరగడంతో వాయిదా పడ్డాయి. దీంతో బుధవారం మళ్లీ నిర్వ హించారు. ఇదిలావుంటే, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు కావున పేరెంట్స్‌ మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే చూడాలని తొలుత టీడీపీ వర్గీయులు కోరారు. అయితే వైసీపీ వర్గీయులు మాత్రం ఒకటో తరగతిని మినహాయించి ఎన్నికలు జరపాలని పట్టు బ ట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వా దం కాస్త కొట్లాటకు దారితీసింది. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు గాయప డ డంతో పోలీసులకు ఫిర్యాదులు చేసు కున్నారు. దీంతో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి, ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో కేసులను ఉపసంహరిం చుకున్నారు.  ఈ సందర్భంగా పలు వురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లా డుతూ గత నెలలో ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఘర్షణ జరడంతో వాయిదా పడ్డాయని, బుధవారం తిరిగి ఎన్నికలు నిర్వహించే సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే గొడవలు జరిగేవి కావని పేర్కొన్నారు. 

  రాచపల్లి పేరెంట్స్‌ కమిటీ ఎన్నిక మళ్లీ వాయిదా 

మాకవరపాలెం :  మండలంలోని రాచపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పేరెంట్స్‌ కమిటీ ఎన్నికకు వైసీపీ శ్రేణులు హాజరు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రధానోపాధ్యాయిని జయలక్ష్మి తెలిపారు. తిరిగి మళ్లీ వారం రోజుల తరువాత సీక్రెట్‌ ఓటింగ్‌ ద్వారా ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గత నెల 22న మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశా లల్లో ఈ ఎన్నికలు జరపగా, రాచ పల్లి, ఎరకన్నపాలెం గ్రామాల్లో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎరకన్నపాలెంలో నిర్వహించిన పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థిని అడిగర్ల వరలక్ష్మి గెలుపొందారు. అయితే రాచపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందుతారని ముందుగా తెలుసుకున్న వైసీపీ నాయకులు పాఠశాల వద్దకు రాకుండానే ఎన్నికలు నిలిపి వేయించారని టీడీపీ నాయకులు, ఎంపీ టీసీ సభ్యుడు రుత్తల ఎర్రాపాత్రుడు, రుత్తల జోగిపాత్రుడు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు పాఠశాల వద్దకు వచ్చి రెండు గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా వైసీపీ శ్రేణులు రాలేందటూ మళ్లీ వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-07T06:30:50+05:30 IST